open school admissions
-
సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: చదువు పట్ల ఆసక్తి ఉండి.. బడికి వెళ్లి చదువుకోలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ల్లో చేరే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే పరీక్ష ఫీజులను కూడా వీటిలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇక నుంచి ఎవరైనా.. ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తమ పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు వాటికి సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపులు వంటి సేవలను తమ దగ్గరలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందొచ్చు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ)ల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ సేవల టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయిందని.. వచ్చే వారంలో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. తప్పనున్న ఇబ్బందులు.. కాగా, ఓపెన్ స్కూల్ ద్వారా ప్రవేశాలు పొందాలంటే ఇప్పటివరకు అధికారిక వెబ్సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. సొంతంగా ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్, వెబ్ వినియోగంలో అవగాహన ఉన్నవారు ఇంట్లో నుంచే ప్రవేశాలు పొందేవారు. నెట్ సదుపాయం, అవగాహన లేకపోతే తమ ప్రాంతంలో లేదంటే, సమీప çపట్టణంలో నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ప్రవేశపెడుతుండటంతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. మరోవైపు.. 14 ఏళ్ల లోపు బడి ఈడు పిల్లలు ఎవరైనా పాఠశాలలకు వెళ్లని పరిస్థితి ఉంటే.. అలాంటి వారందరినీ ఆయా ప్రాంత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. వారందరినీ వంద శాతం బడుల్లో చేర్పించేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. అలాగే వివిధ కారణాలతో బడి వయసు ఉన్నవారు, బడులకు వెళ్లలేని వారితోపాటు 17 ఏళ్లు దాటిన వయోజనులు ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్ చదువుకునే అవకాశాన్ని సచివాలయాల ద్వారా అందిస్తోంది. ఏటా నవంబర్‌నెలాఖరు దాకా అడ్మిషన్లు.. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబరు నెలాఖరు వరకు కొనసాగుతోందని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి “సాక్షి’కి తెలిపారు. ప్రవేశాలకు పేర్ల నమోదు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఎక్కువగా చేసుకుంటారని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆయా తరగతుల ఆన్లైన్ పాఠాల బోధన వీడియోలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సార్వత్రిక విద్య అంటే.. మన దేశంలో కనీసం ఇంటర్‌గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది ఇంటర్‌లోపు చదువుకున్న వారు ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లోపు చదివిన వారందరినీ ఓపెన్ స్కూల్ ద్వారానైనా చదువుకునేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. -
ఓపెన్‌స్కూల్ పిలుస్తోంది
సాక్షి, ధర్మపురి(కరీంనగర్) : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో పాఠశాల విద్యను మధ్యలో మానేసిన వారు ఓపెన్స్కూల్లో చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞానం, వృత్తి విద్యా సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టింది. 14 ఏళ్లు నిండిన వారందరికీ దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 42 ఓపెన్ స్కూళ్లు ఉన్నాయి. విద్యపై మక్కువ, ఉన్నత విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్న వారికి ఓపెన్ స్కూళ్లు ఒక వరంగా మారాయి. ప్రతినెలా రెండో శనివారం, ప్రతీ ఆదివారం విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు. వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఈనెల31తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో మాత్రం నవంబర్ 10 వరకు అవకాశం ఉంది. వయో పరిమితి ► పదో తరగతిలో ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ► ఇంటర్మీడియట్ ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమతి లేదు. బోధనా విషయాలు పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్లో బోధన విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు. ► గ్రూపు ఏ భాషలు ► గ్రూపు బీ మొయిన్ సబ్జెక్టులు ► (భాషేతర విషయాలు) ► గ్రూపు సీ వృత్తి విద్యా కోర్సులు ► అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలు (సబ్జెక్టులను) ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంటుంది. మండలంలో నిర్ధేశించిన అధ్యయన కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు/జూనియర్ కళాశాలల్లో సంప్రదించాలి. బోధనా మార్పులు ► పదో తరగతిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాద్యమాల్లో ఉంటుంది.ఇంటర్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. కోర్సుల కాలపరిమతి ఓపెన్ స్కూల్లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (మార్చి/ఏప్రిల్) పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ అన్ని పరీక్షలు (5 లేక 6 సబ్జెక్టులు) రాసేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్ తుది పరీక్షకు కనీసం రెండేళ్లు అంతరం ఉండాలి. ప్రవేశ రుసుం పదో తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (అందరికీ) అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరీ పురుషులకు రూ.1000 ఇతరులకు: అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు, దివ్యాంగులకు రూ.600. ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ ఫీజు: 200 (అందరికీ) అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరీ పురుషులకు: రూ.1,100 ఇతరులు: అంటే మహిళ లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు, దివ్యాంగులకు రూ.800. పరీక్ష ఫీజు పదో తరగతికి: ప్రతీ సబ్జెక్టుకు రూ.100, ప్రాక్టికల్ కలిగిన ప్రతీ సబ్జెక్టుకు అదనంగా రూ.50. ఇంటర్మీడియట్: ప్రతీ సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్ కలిగిన ప్రతీ సబ్జెక్టుకు రూ.100. నోట్: (దివ్యాంగులకు మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా పరీక్ష ఫీజులో రాయితీ ఉంటుంది). క్రెడిట్ అక్యుమలేషన్ అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టుల్లో హాజరు కావాలనే నిబంధన లేదు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చు. నిర్ణీత 5 ఏళ్లలో ఎప్పుడైనా వారు కోర్సులో (పదో తరగతి/ఇంటర్మీడియట్) నిర్ధేశించిన సబ్జెక్టులు ఉత్తీర్ణలవుతారో అప్పుడు పాస్ సర్టిఫికెట్ మార్కుల మెమో ఇస్తారు. సద్వినియోగం చేసుకోవాలి చదువును మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువు కొనసాగించే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి. చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి భవిష్యత్‌లో పదోన్నతి పొందేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. – వెంకటేశ్వర్లు, డీఈవో, జగిత్యాల -
ఓపెన్‌స్కూల్ ప్రవేశాలకు చివరి అవకాశం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అపరాధ రుసుముతో ఈ నెల 29 వరకు చివరి అవకాశం కల్పించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్లలోని కో–ఆర్డినేటర్లను సంప్రదించాలన్నారు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి ఈనెల 31 వరకు గడువు పొడిగించారు. అడ్మిషన్ ఫీజుతోపాటు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దగ్గర్లో ఉన్న స్టడీ సెంటర్ల కో–ఆర్డినేటర్లను సంప్రదించి వారి లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్ చేయించాలని సూచించారు. అనంతరం వచ్చిన రెఫరెన్స్ నంబరు ఆధారంగా మీసేవా, ఏపీ ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువు పెంచినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లను సంప్రదించి, వారి లాగిన్–ఐడీ ద్వారా తమ దరఖాస్తును ఆన్లైన్ చేయించుకోవాలన్నారు. ఆన్లైన్ చేయించిన తర్వాత వచ్చిన రెఫరెన్స్ నంబర్ ఆధారంగా ప్రవేశ ఫీజును మీసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాలని కోరారు.