శ్రీజకు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: గ్వాటెమాలా క్యాడెట్, జూనియర్ అంతర్జాతీయ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. సింగిల్స్‌లో రజతం నెగ్గిన శ్రీజ, డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 6-11, 5-11, 8-11తో సాగరిక ముఖర్జీ (భారత్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ-మోరి పవోలా (పెరూ) జోడి 7-11, 11-7, 11-6, 9-11, 9-11 హర్షవర్ధిని-ఐశ్వర్య పాఠక్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. ‘ఇంతకుముందు సాధించిన రెండు స్వర్ణ పతకాలు టీమ్ విభాగాల్లో వచ్చాయి. సింగిల్స్‌లో రజతం నెగ్గడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. తొలి అంతర్జాతీయ పర్యటనలో రాణించినందుకు ఆనందంగా ఉంది’ అని శ్రీజ వ్యాఖ్యానించింది.
సౌమ్యజిత్, మణికలకు టైటిల్స్
న్యూఢిల్లీ: బ్రెజిల్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో భారత్‌కు చెందిన సౌమ్యజిత్ ఘోష్, మణిక బాత్రాలు సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించారు. సాంతోస్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీ మహిళల అండర్-21 ఫైనల్లో మణిక 11-5, 9-11, 12-10, 11-5, 11-5తో కరోలిన్ కుమార్హా (బ్రెజిల్)పై గెలిచింది. అండర్-21 పురుషుల ఫైనల్లో సౌమ్యజిత్ 8-11, 6-11, 11-7, 11-6, 9-11, 11-7, 11-2తో బెంజిమన్ బ్రోసేయర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. టైటిల్స్ గెలిచిన వీరిద్దరికి చెరో 1500 అమెరికా డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది.