హాఫ్ సెంచరీ చేసేశారు..!
గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో బాధపడుతూ ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న 50 మంది పేదలకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీలు చేసి మళ్లీ ప్రాణం పోశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన ఘనత దక్కించుకున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు ఆగస్టు 4న భారీస్థాయిలో సంబరాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మార్చి 18వ తేదీన చేసిన తొలి ఓపెన్‌హార్ట్ ఆపరేషన్ మొదలుకుని ఈనెల 27వ తేదీన చేసిన 50 వ సర్జరీ వరకు అన్నీ విజయవంతం అయ్యాయి. ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పిపిపి) విధానంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా మొట్టమొదటిసారిగా గుంటూరులో ఓపెన్‌హార్ట్ సర్జరీలు ప్రారంభించింది. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రుల్లో అమలు చే సే పనిలో ప్రభుత్వం ఉంది.
ప్రధాన భూమిక డాక్టర్ గోఖలేదే...
జీజీహెచ్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం అవడానికి కీలకమైన వ్యక్తి డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే. గుంటూరు వైద్య కళాశాలలో చదివిన డాక్టర్ గోఖలే తాను చదువుకున్న కళాశాలకు ఏదైనా తన వంతుగా చేయాలనే సదాశయంతో తానే స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యంను కలిసి జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేసేందుకు అవకాశం ఇవ్వాలని అడిగారు. ప్రభుత్వం డాక్టర్ గోఖలేతో పీపీపీ విధానంలో పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.
రూ.2.50 లక్షలు అయ్యే ఆపరేషన్ ఉచితంగా...
ప్రైవేటు ఆస్పత్రులలో సుమారు రెండున్నర లక్షల వ్యయం అయ్యే ఓపెన్‌హార్ట్ సర్జరీలను జీజీహెచ్‌లో ఎన్టీఆర్ ఆరోగ్యసేవ పథకం ద్వారా ఉచితంగానే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారికి సైతం ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల కాగానే ఆపరేషన్లు చేస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. భవిష్యత్తులో గుండెమార్పిడి ఆపరేషన్లు ప్రారంభించి రాష్ట్రంలోనే నంబర్‌వన్ టీచింగ్ హాస్పటల్‌గా జీజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.