స్నేహితులే తాగి చంపేశారు!
► సునీల్‌ను స్నేహితులే హతమార్చారు
► విలేకరుల సమావేశంలో డీఎస్పీ
బాపట్ల టౌన్ : మత్తు పానీయాల కోసమే వేము సునీల్ అలియాస్ బుడ్డాను అతని స్నేహితులు హత్య చేశారని బాపట్ల డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. స్థానిక సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. వెదుళ్లపల్లి టీచర్స్ కాలనీకి చెందిన వేము సునీల్ అలియాస్ బుడ్డా(24), బేతపూడి ఎస్సీ కాలనీకి చెందిన కట్టా యోహాను అలియాస్ సురేష్, కట్టా శ్యాంప్రసాద్ స్నేహితులు. వీరు ముగ్గురూ మత్తు నిచ్చే టానిక్‌లు, మాత్రలకు బానిసలయ్యారు.
మత్తు పానీయాలకు నిత్యం తానే ఖర్చు పెడుతున్నానని, మీరు ఎప్పుడు ఖర్చుపెట్టడం లేదంటూ సునీల్ గతంలో రెండు పర్యాయాలు స్నేహితులతో గొడవపడ్డాడు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న కట్టా యోహాను, కట్టా శ్యామ్ప్రసాద్లు ఎలాగైనా సునీల్‌ను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నారు.
హతమార్చిందిలా..
మత్తు పదార్థాలు తీసుకుందామని మార్చి 4వ సాయంత్రం సునీల్‌కు యోహాను, శ్యాంప్రసాద్ ఫోన్ చేసి పిలిచారు. వారి మాటలు నమ్మిన సునీల్ స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనం, ల్యాప్ ట్యాప్ తీసుకొని కంకటపాలెం వెళ్లే రైల్వేబ్రిడ్జి దగ్గరకు వెళ్లాడు. మత్తుపదార్థాలు తీసుకున్నారు. సునీల్ పూర్తిగా మత్తులోకి వెళ్లాడని గ్రహించిన స్నేహితులు కోడిపందేలకు ఉపయోగించే కత్తితో అతని గొంతు కోశారు. మృతుడి ద్విచక్రవాహనాన్ని గవినివారిపాలెం వె ళ్లే దారిలో చప్టా కింద పెట్రోలు పోసి తగులబెట్టారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా బేతపూడి వీఆర్వో వద్దకు వెళ్ళి లొంగిపోయారని డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామన్నారు. సమావేశంలో బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు సీహెచ్.సురేష్, చెన్నకేశవులు పాల్గొన్నారు.