అందరికోసం పనిచేస్తే కేంద్రానికి మద్దతు
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్వరం మారింది. శారదా స్కాంలో తృణమూల్ నేతలనూ సీబీఐ అరెస్టు చేయడంతో పార్టీ ఇరుకున పడిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మోదీ సర్కారుకు పూర్తి మద్దతునిచ్చేందుకు తృణమూల్ సిద్ధంగా ఉండేదని మమత అన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా శనివారమిక్కడ వివిధ మతాల నేతల ఆధ్వర్యంలో జరిగిన మత సామరస్య ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడారు. ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తూ రాజకీయాలు చేయడాన్ని తాము అంగీకరించబోమని, పాలనను, రాజకీయాలను మిళితం చేయరాదన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాల సంక్షేమం కోసం నిర్మాణాత్మకంగా, వాస్తవికంగా పాలన సాగిస్తే కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని మమత వ్యాఖ్యానించారు.
సమాఖ్య వ్యవస్థను గౌరవించండి: బీజేపీ
మోదీ ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి సమాఖ్య వ్యవస్థను గౌరవించి హాజరు కావాలని మమతకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. బెంగాల్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించవచ్చని కూడా సూచించినా, సమావేశానికి రాకూడదని ఆమె నిర్ణయించడాన్ని తప్పుబట్టింది. పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ.. రాజకీయ విభేదాలను మమత మరిచిపోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధితో దేశం మొత్తాన్నీ ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలన్నదే మోదీ ప్రాధాన్యమన్నారు.