బంద్‌లో ఎవరికి వారే
పెద్దనోట్లకు రద్దుకు వ్యతిరేకంగా సోమవారం కలిసికట్టుగా బంద్ నిర్వహించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడంతో వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో తప్ప దేశంలో ఎక్కడా బంద్ ప్రభావం పెద్దగా కనపించలేదు.
బెంగాల్లో వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగానే ఉన్నా, మమతా బెనర్జీ నయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభావం లేకుండా పోయింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు యథావిధిగా నడవడంతో పాటు ప్రైవేటు వాహనాల రాకపోకలు కొనసాగాయి. వామపక్షాల కార్యకర్తలు, మమతా బెనర్జీ విడివిడిగా వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 గంటల బంద్‌కు వామపక్షాలు పిలుపునివ్వగా, ముందుగా మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో బంద్ నుంచి వెనక్కి జరిగి 'ఆక్రోశ్ దివస్'కే పరిమితమైంది. టీఆర్ఎస్, జనతాదళ్ (యూ) పార్టీలు ఆందోళనకే పూర్తి దూరంగా ఉన్నాయి.
'ప్రతిపక్షాలు కోరుకుంటున్నది అవినీతి బంద్‌నా, భారత్ బంద్‌నా' అంటూ ప్రధాని నరేంద్రమోదీ సకాలంలో ప్రశ్నించిన నేపథ్యంలో దేశ ప్రజల్లో మోదీకున్న ప్రభావాన్ని తలుచుకొని కాంగ్రెస్ పార్టీ బంద్ నుంచి వెనకడుగు వేసినట్లు ఉంది. పెద్ద నోట్ల రద్దుకు ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదికపైకి కలిసిరాకపోవడం మోదీ ప్రభుత్వానికి కలిసొచ్చిన అంశం. పార్లమెంట్‌ను స్తంభింప చేయడం మినహా విపక్ష పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పటివరకు కనీసం పార్లమెంట్లో మోదీతో జవాబు చెప్పించలేకపోయాయంటే అది ఆ పార్టీల బలహీనతే.
పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేయాలో ప్రతిపక్షాలకు ఓ స్పష్టత లేకపోవడం కూడా బలహీనతే. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకయిందని, దానిపై పార్లమెంట్ సంయుక్త కమిటీతో దర్యాప్తు జరిపించాలని కొన్ని పార్టీలు, ప్రధాన మంత్రి క్షమాపణలు చెప్పాలని మరికొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మొదట్లో డిమాండ్ చేసిన పార్టీలు క్రమంగా ఈ అంశంపై మౌనం వహిస్తూ ప్రజల కష్టాలను తీర్చాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాయి. నల్లడబ్బుకు ఆశ్రయం ఇచ్చే రాజకీయ పార్టీలు ప్రజలతో కలిసి వస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో!