విజేందర్ జైత్రయాత్ర
డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ సొంతం
చైనా బాక్సర్ జుల్పికర్పై 3–0తో విజయం
ముంబై: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్... రింగ్‌లో తనకు ఎదురేలేదని మరోసారి నిరూపించుకున్నాడు. శనివారం చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో జరిగిన బౌట్లో విజేందర్ 3–0తో నెగ్గాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. పది రౌండ్ల పాటు జరిగిన ఈ బౌట్లో చివరకు ముగ్గురు జడ్జిలు విజేందర్కు అనుకూలంగా 96–93, 95–94, 95–94 స్కోరును ప్రకటించారు. దీంతో భారత బాక్సర్ ఏకగ్రీవంగా విజేతగా నిలిచినట్టయ్యింది.
అయితే ఇంతకుముందులా ఈ బౌట్ విజేందర్కు అంత సులువుగా జరగలేదు. చైనా బాక్సర్ నుంచి తీవ్ర పోటీయే ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్లో ఇద్దరూ పూర్తి డిఫెన్సివ్ ఆటను ప్రదర్శించగా తొలి పంచ్ మాత్రం విజేందర్దే అయ్యింది. ఇక రెండో రౌండ్లో ఇద్దరూ వ్యూహాత్మకంగానే కదిలారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పంచ్ విసిరినందుకు చైనా బాక్సర్‌ను రిఫరీ హెచ్చరించారు. ఒక పంచ్ విజేందర్ కంటికింద తాకడంతో కాస్త వాచినట్టయింది. నాలుగో రౌండ్లో జుల్పికర్ దూకుడును కనబరిచాడు. అయితే అతడి వేగవంతమైన పంచ్‌లను విజేందర్ సులువుగానే తప్పించుకోగలిగాడు. ఐదో రౌండ్ వరకు కూడా నువ్వా నేనా అనే రీతిలోనే బౌట్ సాగినా ఆ తర్వాత విజేందర్ కాస్త పైచేయి సాధించాడు.
అఖిల్, జితేందర్ టెక్నికల్ నాకౌట్ విజయాలు
అఖిల్ కుమార్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను నాకౌట్ విజయంతో ఆరంభించాడు. జూనియర్ వెల్టర్ వెయిట్ కేటగిరీలో టై గిల్‌క్రిస్ట్ (ఆసీస్)ను ఓడించాడు. అలాగే జితేందర్ కూడా లైట్‌వెయిట్ కేటగిరీలో థానెట్ లిఖిట్కామ్పోమ్పై గెలిచాడు.