Orientation program
-
ఎమ్మెల్యేలకు పాఠాలు
-
మనవాళ్లే బాధితులైతే.. ఉపేక్షిస్తామా
-
మనవాళ్లే బాధితులైతే.. ఉపేక్షిస్తామా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దళితులమీద దాడులు సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇతరత్రా ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి తేడా ఉందని.. తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తప్పవన్నారు. ఏదైనా పొరపాటు చేస్తే.. ఎస్సైని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదన్నారు సీఎం జగన్. తప్పు చేసింది ఎస్సై అయినా సీఐ అయినా సరే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా. ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ సందేశాన్ని పోలీసు అధికారులు కింది స్థాయికి తీసుకెళ్లాలి అని సీఎం జగన్ కోరారు. (చదవండి: మలుపు తిరిగిన శిరోముండనం ఘటన) కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు, తదితర స్థాయిలో ఉన్నవారికి ఓరియెంటేషన్ నిర్వహించాలన్నారు సీఎం జగన్. మానవత్వంతో వ్యవహరించడంతో పాటు.. ప్రజలకున్న హక్కులేంటి.. మనం ఎంత వరకు వెళ్లాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. గుండుకొట్టించడం లాంటి ఘటనలు తప్పు.. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదని స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నమన్నారు సీఎం జగన్. ఎస్పీలు, ఏఎస్పీలు ఈ సందేశాన్ని దిగువస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి దళితురాలు, డీజీపీ ఎస్టీ అని గుర్తు చేశారు. సమాజంలో దిగువున ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. అక్రమ మద్యం తయారీ, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా చట్టానికి అతీతులు కారన్నారు. ఇది మనసులో పెట్టుకుని విధులు నిర్వహించాలన్నారు. అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు.. సీఎం జగన్ సీరియస్) -
సక్సెస్ మంత్ర ఎంతో ఉపయోగం
ఒంగోలు : పదో తరగతి పూర్తి చేసి ఇంటర్లో చేరబోయే విద్యార్థులకు బ్రిలియంట్ సంస్థ రూపొందించిన సక్సెస్ మంత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని స్టెప్ సీఈఓ డాక్టర్ బి.రవి అన్నారు. ఆదివారం స్థానిక బ్రిలియంట్ కంప్యూటర్స్ సంస్థ ఆవరణలో బ్రిలియంట్ సంస్థ నిర్వహించిన సక్సెస్ మంత్ర వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సక్సెస్ మంత్ర పేరుతో రూపొందించిన టెక్–10 విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పుతుందన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువుగా జరుగుతున్నందు వల్ల ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. బ్రిలియంట్ సంస్థల చైర్మన్ డాక్టర్ షేక్ న్యామతుల్లాబాషా మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులకు వేసవిలో ఈ ఏడు అందించే అదనపు ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లైఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఆథరైజ్డ్ సెంటర్ అని, ఈ ప్రోగ్రాంలో పదో తరగతి ఆపై విద్యార్థులకు వ్యక్తిత్వ, విద్యా సంబంధ విషయాల్లో విశ్వ విద్యాలయ ప్రొఫెసర్లచే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు చిన్నవయస్సులలోనే యూనివర్శిటీ సర్టిఫికేట్‌ను పొందడమే గాక తమ కెరీర్ ఎలా మలుచుకోవాలి, సమాజం , తల్లిదండ్రులపై బాధ్యతగా ఎలా ఉండాలి అనే అంశాలు పూర్తిగా ఉచితంగా నేర్పడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వచ్చే ఆదివారం పదో తరగతి, ఇంటర్ పూర్తయిన విద్యార్థినీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై ఉచిత వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ కిషోర్‌కుమార్ తదితర అనుభవజ్ఞులు హాజరై మార్గదర్శకం చేస్తారన్నారు. అనంతరం సక్సెస్ మంత్ర అంశంపై నేషనల్ ట్రైనర్ రవికాంత్ హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం: కేంద్ర మంత్రి గెహ్లాట్
సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్): కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రిగా మూడున్నరేళ్లుగా ఆనందంగా పనిచేస్తున్నానని, తన శాఖలో మూడు గిన్నిస్ రికార్డులు రావడం గర్వకారణంగా ఉందని తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఇక్కడి త్యాగరాయ గానసభలో వికలాంగుల హక్కుల చట్టం-2016 పై శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 21 కేటగిరీలను చట్టంలోకి తెచ్చిన ఘనత తమదేనని, 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచామని, కళాశాలల్లో చేరికల కోసం 5 శాతం రిజర్వేషన్‌ను తమ ప్రభుత్వమే మొదలు పెట్టిందని వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇస్తే సంతోషమని అన్నారు. వికలాంగుల గుర్తింపు కార్డులు జిల్లాస్థాయిలో మాత్రమే కాదు దేశమంతా చెల్లుబాటయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక్క స్కూల్ అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. 10 లక్షల మంది దివ్యాంగులలో 4 లక్షల మందికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు కేంద్రం అమలు జరిపే పథకాలపై అవగాహన కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో వికలాంగుల హక్కుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు కూడా పాల్గొన్నారు. -
బోధనా నైపుణ్యం పెంపొందించుకోవాలి
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నల్లగొండ అర్బన్: నేటి విద్యార్థి పాఠ్యపుస్తకాలకే పరిమితం కావ డం లేదని, విసృ్తతమైన వారి ఆలోచనా పరిధికి అనుగుణంగా అధ్యాపకుడు బోధనానైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక గౌతమి కాలేజీలో జూనియర్ లెక్చరర్లకు నిర్వహిస్తున్న ఓరియెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘సామాజిక న్యాయం-సమానత్వం’ అనే అంశంపై ప్రసంగించారు. సుదీర్ఘకాలం ఒకే వృత్తిలో పనిచేస్తున్న వారికి మళ్లీ శిక్షణలు, అవగాహన సదస్సులు అవసరమా అని సహజంగా అందరికీ సందేహాలొస్తుంటాయి కానీ, ఇలాంటి కార్యక్రమాలు సమష్టి చర్చకు వేదిక అవుతుందనేది వాస్తవమన్నారు. ఉన్న సబ్జెక్టును మరింత బాగా బోధించడానికి పునశ్చరణ అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక వసతుల కొరత, అధ్యాపకుల ఖాళీలు ఇతర సమస్యలతో బోధన క్లిష్టంగా మారుతోందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనతో ఇంటర్ విద్యకు పూర్వవైభవం దక్కగలదన్నారు. సూత్రీకరణ ద్వారానే సంకల్పాన్ని చేరుకోగలరన్నారు. నిత్యజీవితంలో సూత్రీకరణ లేకుండా పురోగతిని సాధించలేమన్నారు. సంకల్పం లేకుండా దేన్నీ విశ్లేషించలేమన్నారు. సమాజం లో అంతరాలు పాటించే పరిస్థితి పోవాలంటే సమానజీవన అవకాశాలు రావాలన్నారు. సామాజిక శాస్త్రాల పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంటర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పి. మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా బోధనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. శిక్షణలకు హాజరు కావడం, సమావేశాల్లో పాల్గొనడం వల్ల జ్ఞాన వికాసాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆర్ఐఓ నెమ్మాది ప్రకాశ్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, ఇంటర్‌బోర్డు పరీక్షల రిటైర్డ్ కంట్రోలర్ ఎం.భాస్కర్‌రెడ్డి, ఎంజీ యూనివర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ ఆకుల రవి, దేవరకొండ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మారుతీరావు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు గోనారెడ్డి, నర్సిరెడ్డి, అంజయ్య, గట్టుపల్లి అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.