9న రాష్ట్రానికి రాహుల్!
* ఓయూలో పర్యటన అనుమానమే
* విద్యార్థి సంఘాల మధ్య విభేదాలే కారణం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబరు 9న రాష్ట్రానికి రానున్నట్టుగా టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. అయితే ఆయన ఉస్మానియా వర్సిటికీ వెళ్తారా లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక, ఓయూలో విద్యార్థి సదస్సులో పాల్గొనడానికి రాహుల్ ఆగస్టు మొదటి వారంలోనే రాష్ట్రానికి రావాల్సి ఉంది.
అయితే జాతీయ రాజకీయ పరిణామాలు, భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ వంటి వాటి వల్ల పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఆ పర్యటన సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఉండే అవకాశాలున్నట్టుగా ఏఐసీసీ వర్గాల నుంచి సూత్రప్రాయ సమాచారం అందినట్టుగా టీపీసీసీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు, నగర పాలకవర్గ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాహుల్‌తో పర్యటన చేయిం చాలని టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
ఇందుకు అనుగుణంగా ఇప్పటికే పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసింది. కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ గత ఎన్నికల్లోని పరాభవం వల్ల వచ్చిన నైరాశ్యం పోగొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు రాహుల్ పర్యటనను వాడుకోవాలని వారు భావిస్తున్నారు. వరంగల్ జిల్లా పార్టీ నేతల మధ్య విభేదాలు పోగొట్టేందుకు లోక్‌సభ పరి ధిలోని నియోజకవర్గాల నాయకులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు మైనారిటీలు, దళితులతోనూ ఆయన సమావేశం కానున్నారు.
విద్యార్థుల్లో విభేదాలపై రాహుల్‌కు మెయిల్స్
తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనాలంటూ పలువురు విద్యార్థి నేతలు ఇప్పటికే రాహుల్‌ను కలిశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఓయూలో ఆయనతో సమావేశం ఏర్పాటు చేయించేందుకు టీపీసీసీ కూడా ఉత్సాహంగా ఉంది. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు ఉన్నట్టుగా రాహుల్‌గాంధీకి మెయిల్ ద్వారా, ఫ్యాక్సుల ద్వారా ఫిర్యాదులు అందాయి.
విద్యార్థి సంఘాల మధ్య విబేధాలు రాహుల్ పర్యటనపై ప్రభావం చూపినా, కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరిగినా జాతీయవ్యాప్తంగా దుష్ర్పభావం ఉంటుందని కొందరు నేతలు వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఓయూలో రాహుల్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి.