జగమే రామమయం..
ఇస్కాన్‌కు చేరిన విదేశీ భక్తులు l
నేడు రామాయణ నృత్యరూపకం ప్రదర్శన l
వారే ప్రధాన పాత్రధారులు
‘యావత్ స్ధాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి’ – ‘ఈ భూమండలం మీద పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ గాథ సమస్త లోకాల్లో కీర్తింపబడుతుంది.’ ఇది వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పిన మాట. ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నారు విదేశాలకు చెందిన పలువురు భక్తులు.ఇస్కాన్ మందిరం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళాకేంద్రంలో శుక్రవారం రామాయణ నృత్యరూపకాన్ని వారు ప్రదర్శించనున్నారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ 35 మంది కళాకారులు గురువారం ఇస్కాన్ మందిరానికి చేరుకున్నారు. అదే రోజున జరగనున్న జగన్నాథ రథయాత్రలో వారు పాల్గొంటారు. అనంతరం ఆనం కళాకేంద్రంలో రామాయణ నృత్యరూపకం ప్రదర్శిస్తారు. దీనిని తిలకించడానికి ఇప్పటికే సుమారు 200 మంది విదేశీ భక్తులు కూడా నల్లనయ్య మందిరానికి అతిథులుగా వచ్చారు. శ్రీరామకథ తమ అంతరంగాలను, ఆలోచనలను ప్రభావితం చేసిందని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
– రాజమహేంద్రవరం కల్చరల్
తోడు వచ్చే దివ్యకథామృతం
రామకథ నన్ను సమ్మోహనపరుస్తోంది. ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల రచనలు చదివి, నేను రామాయణంపట్ల ఆకర్షితురాలినయ్యాను. వాల్మీకి రామాయణాన్ని తెలుసుకున్నాను. దాని ఆధారంగా ఆంగ్లంలో నృత్యరూపకం రచించి, స్వరకల్పన చేశాను. ఇందులో సంభాషణలుండవు. హిందీలో కొన్ని కీర్తనలున్నాయి. నాకు వెన్నంటి తోడు వచ్చే దివ్యకథామృతం రామాయణం.
– మాధుర్య కదంబిని (అసలు పేరు : మరియ), రష్యా
గాత్రధారణ నాదే
రామాయణం నృత్యరూపకంలో కీర్తనలకు గాత్రధారణ నాదే. ఇది అదృష్టంగా భావిస్తున్నా. ఈ నృత్యరూపకంలో నేను గానం చేసిన ‘హే రామ్! హే రామ్! తుహి మాతా, తుహి పితా హై’ పాట నిరంతరం నాలో మార్మోగుతూనే ఉంటుంది. శ్రీరాముడిని జగత్తుకే ఆదర్శ పురుషునిగా భావిస్తాను.
– శ్రీరామప్రసాదందాస్ (అసలు పేరు : లిత్వీనియా), యూరోప్
మర్యాదా పురుషోత్తముడు
శ్రీరామ పాత్ర నన్ను అమితంగా ఆకట్టుకున్నది. ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాముడు ధర్మం తప్పలేదు. నేడు, ఏనాడూ పాలకులకు, ప్రజలకు ఆయన ఆదర్శపురుషుడు. మర్యాదా పురుషోత్తముడు. ఈ పాత్రను ధరించడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.
– శచీప్రాణ్ గౌరంగదాస్, రష్యా
రాక్షస పీడను తొలగించింది శూర్పణఖే..
రామాయణాన్ని స్త్రీ పాత్రలే మలుపుతిప్పాయి. మంధర లేకపోతే రామ వనవాసం లేదు. శూర్పణఖ లేకపోతే, రావణాది దుష్టరాక్షస సంహారం జరిగి ఉండేది కాదు. నేను నృత్యరూపకంలో ధరిస్తున్న శూర్పణఖ పాత్ర ప్రాధాన్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాను. – శ్యామనాథ్ రాణి, రష్యా
రష్యాలో అనేక ప్రదర్శనలు జరిగాయి
సుమారు 45 నిమిషాలు సాగే ఈ నృత్యరూపకంలో 35 పాత్రలుంటాయి. రష్యాలో అనేక పర్యాయాలు ప్రదర్శించాం. అక్కడి ప్రేక్షకుల అభినందనలు అందుకున్న రూపకం ఇది. తరతరాలుగా ప్రజలను అలరిస్తున్న ఈ నృత్యరూపకాన్ని గోదావరి తీరాన ప్రదర్శించడం సుకృతంగా భావిస్తున్నాను.
– మరీచీదాస్ (అసలు పేరు : మార్సిలో లిబియో), అర్జంటీనా