‘మనగుడి’
కంకణాలకు పూజలు
తిరుమల:హైందవ ధర్మాలు, ఆలయ సంప్రదాయాలను కాపాడటం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘మనగుడి’ ఐదో విడత కార్యక్రమాన్ని వచ్చేనెల 10వ తేదీన రాష్ర్టవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచిన కంకణాలను ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రదర్శనగా ఆలయానికి తీసుకెళ్లారు. గర్భాలయంలో మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోని 52వేల ఆలయాలకుతరలిస్తామని ఈవో గిరిధర్ గోపాల్ వెల్లడించారు.
వీఐపీ టికెట్లు ఇక 800 లోపే
వెంకన్న దర్శనంకోసం వీఐపీ బ్రేక్ టికెట్లు ఇకనుంచి రోజుకు 800 లోపే కేటాయించనున్నామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. సాధారణ భక్తుల రద్దీ, ప్రభుత్వ ఉద్దేశం, ప్రాధాన్యతల ప్రకారం టీటీడీ నడుచుకుంటోందని, ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం విలేకరులకు వివరించారు. వీఐపీ భక్తులు కానివారు సిఫారసు లేఖలతో వచ్చి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఆశించవద్దని విజ్ఙప్తి చేశారు. గతంలో వీఐసీలకు రోజుకు మూడు వేలకు పైగా ఇచ్చేవారమని, పెరుగుతున్న సాధారణ భక్తుల రద్దీకి అనుగుణంగా వాటిని 800లకు కుదించామన్నారు.