రుణమాఫీ చేసి తీరుతాం
చేవెళ్ల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీచేసి తీరుతామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లిలో ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామానికి బస్సు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ‘మన ఊరు- మన ప్రణాళిక ’లో అధికారులు ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని అన్నారు.
చేవెళ్లలో బస్ డిపో నిర్మాణంతోపాటు బస్‌స్టేషన్‌ను విస్తరిస్తామన్నారు. దళిత కుటుంబాలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని వచ్చేనెలలో ప్రారంభించనున్నట్టు వివరించారు. దేవునిఎర్రవల్లికి బస్సు సౌకర్యం కల్పిస్తామని, పాఠశాలలో టాయిలెట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మంజీరా నీటిని అందించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాగు, తాగునీటితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, జెడ్పీటీసీ చింపుల శైలజసత్యనారాయణరెడ్డి, సర్పంచ్ శ్యామలయ్య, ఎంపీటీసీ సత్యనారాయణగౌడ్‌లు గ్రామ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు.
కార్యక్రమంలో వాటర్‌షెడ్ పీడీ జాన్సన్, ఇన్చార్జి ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రత్నమ్మ, మండల ప్రత్యేకాధికారి దేవ్‌కుమార్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు మాసన్నగారి మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలను టీఆర్ఎస్ నాయకులు, గ్రామప్రజలు సన్మానించారు.