ధరలు తగ్గేదెన్నడు బాబూ?
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా ఐదేళ్లూ ఇంకా నోటిలోకి పోని దురవస్థలో సామాన్య ప్రజలు బ్రతుకీడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంబరాన్నంటుతున్న అత్యవసర వస్తువుల ధరలతో ఏం కొ(తి)నేటట్టులేని దుస్థితి దాపురించింది. కొన్ని నెలలుగా కొండెక్కి తిష్ఠ వేసిన పప్పులు, బియ్యం, ఉల్లి ధరలు ఎంతకీ దిగిరాకపో వడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150, మినప్పప్పు రూ.180 అమ్ముతున్నారు. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందం టారు కానీ అదే ఉల్లి నేడు కోయకుండానే అమ్మలకు కన్నీరు తెప్పిస్తోంది. కిలో ఉల్ల్లిపాయలు కొండెక్కి కూర్చు న్నాయి. కూరగాయల ధరలూ ఎవరూ కొనలేని స్థితికి చేరాయి. ఫలితంగా పేదవాడి ఇంట వంటింటి సంక్షోభం ఏర్పడుతోంది.
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి, వాటి ధరలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. అటు కేంద్రం, ఇటు రాష్ర్టంలో కొత్త ప్రభు త్వాలు కొలువు దీరి పదిహేను నెలలు గడచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి పెచ్చరిల్లిం దన్నది వాస్తవం. అదే సమయంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం సామాన్యులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వాలు గద్దె నెక్కి పదిహేను నెలలు గడచినా ధరలు దిగిరావడంలేదు సరికదా... అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు పాలకుల నుంచి ఎలాంటి ప్రయత్నాలూ జరగడంలేదు. మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు అదుపులోకి వచ్చాయి. ఆ మేరకు నిత్యా వసరాల ధరలే తగ్గడంలేదు.
వ్యాపారులు సరకుల కృత్రి మ కొరత సృష్టించి, వాటి ధరలు దిగిరాకుండా అడ్డు కుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కొని నిత్యావసరాల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అంతేగాకుండా అన్ని నిత్యావసర వస్తువులను చౌక దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. పేద, సామాన్య ప్రజల పట్ల తనకు గల కర్తవ్యాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు.
- బట్టా రామకృష్ణ దేవాంగ
సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా