'ఔట్ లుక్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం'
కాచిగూడ(హైదరాబాద్): ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌తో పాటు సీఎం కేసీఆర్‌పై అభ్యంతర కథనాలు ప్రచురించిన ఔట్లుక్ పత్రికపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపర్తి సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. తమ తప్పును ఒప్పుకుని, క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో ఢిల్లీలోని ఔట్లుక్ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడ చెప్పల్‌బజార్‌లోని అవుట్‌లుక్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆ పత్రిక ప్రతులను తగులబెట్టారు.
ఔట్లుక్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ మహిళల మనోభావాల్ని కించపరిచే విధంగా కథనాన్ని ప్రచురించిన ఔట్లుక్ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు.