అద్భుత నిర్మాణంగా క్రైస్తవ భవన్
క్రిస్మస్ విందులో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్రైస్తవ భవనాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచేలా అద్భుతంగా నిర్మిస్తామని, ఇందుకోసం దేశ, విదేశీ ఆర్కిటెక్ట్‌ల సేవలను వినియోగించుకుంటామని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ భవన్‌లోనే జరుపుకొనే విధంగా వేగం గా నిర్మాణం జరుపుతామని పేర్కొన్నారు. మూడు వేల మంది సామర్థ్యంతో ఎకరా స్థలంలో డైనింగ్ హాల్, మరో ఎకరా స్థలంలో పచ్చదనం ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.
నలు దిక్కుల నుంచి కనిపించేలా భవనంపై నిలువెత్తు ఏసు ప్రభువు విగ్రహం, శిలువను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన రూ. 10 కోట్లకు అదనంగా మరో రెండు కోట్లను ఈ భవన నిర్మాణం కోసం ఇస్తామన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో సోమవారం రాత్రి సుమారు వెయ్యి మందికిపైగా క్రైస్తవ ప్రముఖులకు సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చెర్మైన్ స్వా మి గౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టి.రాజయ్య, హోంమంత్రి నా యిని నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని మతాల సంగమంగా ఏర్పడిన అద్భుత సమాజం తెలంగాణ అని కొనియాడారు.
నేడు నల్లగొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం నల్లగొండ జిల్లా దామరచర్ల, మఠంపల్లి మండలాల్లో ఏరియల్ సర్వేకు వెళ్తున్నారు. ఉదయం మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 10వ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న తరువాత, మహేంద్ర హిల్స్‌లో క్రైస్తవ భవన్‌కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి నల్లగొండ జిల్లాలో విహంగ వీక్షణం చేస్తారు.