రేపటి వ్యాపారం
జీవన కాలమ్
రాబోయే కాలంలో అందమైన, చూడముచ్చటయిన, నాజూకు అమ్మాయిలూ మోసుకు తిరగగల ఆక్సిజన్ సిలెండర్లు మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు. వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీ ఆక్సిజన్ కూడా వస్తుంది.
తెల్లారి లేస్తే మనం పేపర్లలో సల్మాన్‌ఖాన్ జింకని చంపిన కేసులో నిర్దోషిగా బయట పడిన కథలూ, ఆమీర్‌ఖాన్ భార్య ఈ దేశంలో ఉండడం భయంగా ఉందన్న కథలూ చదివి ఆనందిస్తాం. కాని అందరూ చదవాల్సిన, తెలు సుకొనవలసిన, తెలిసినా ముఖం చాటేసే నాయకులకు ఈ పాటికే తెలిసిన సత్యాలను తెలుసుకోము. మొన్న పేపర్లో 11వ పేజీలో ఓ చిన్న వార్తని ఓ మూల ప్రకటించారు. ఇది మానవాళి వణికిపోతూ పట్టించుకోవలసిన సంగతి. ‘‘రాబోయే కాలంలో మనుషులు పరిశుభ్రమైన గాలిని పీల్చడానికి తమ తమ ఆక్సిజన్ సిలెండర్లను మోసుకు తిరగాల్సిన రోజులు వస్తాయి’’అని జాతీయ హరిత ట్రిబ్యునల్ అధ్యక్షులు స్వతంతర్ కుమార్‌గారు సిమ్లాలో అన్నారు.
మన దేశంలో - మన తాతలకాలంలో -గ్రామా లలో మండించే ఎండల్లో ఏ ఇంటి ముందునిలిచినా ‘చల్ల’ని హర్ధికంగా ఇవ్వడాన్ని విన్నాం. ఇప్పుడు ‘చల్ల’మాట దేవుడెరుగు పరిశుభ్రమైన మంచినీటికే దిక్కులేదు. ఇప్పుడిప్పుడు దాదాపు ప్రతీ వ్యక్తి తమ తమ మంచినీటి సీసాల్తో కనిపించడం మనకి అలవాటైన దృశ్యం. తాగే నీటిని పట్టుకు తిరిగే రోజు వస్తుందని నా చిన్నతనంలో నేను అనుకోలేదు. మరి 60 ఏళ్లలో అంటే మన పిల్లల తరంలోనే స్నానం చేయడానికి సరిపోయే నీరు కరువౌతుందని ఆ మధ్య ఒకాయన చెప్పారు. ఏవో రసాయన పదార్ధాలతో ఒంటిని తుడుచుకోవడం ఫ్యాషన్‌గా మారుతుందట. ఇది గ్లామర్ కోసం కాదు. గతిలేక అన్నాడీయన.
పారిశ్రామిక ప్రగతిని సాధించిన ఈ రెండు శతాబ్దాలలోనే లక్షల సంవత్సరాలు ఈ భూమిని జీవనయోగ్యంగా ఉంచిన వనరులు, వాతావరణం క్రమంగా భయంకరంగా భయంకరమైన వేగంతో కలుషితమైపోతున్నాయి. మానవులు ఈ భూమిని వాడుకునే లేదా దుర్వినియోగం చేసే వేగంతో భూమి తనని తాను పునరుద్ధరించుకునే వేగం పుంజుకోలేకపోతోంది.
ఈ భూమి వయసుతో పోలిస్తే మానవుని వయసు హాస్యాస్పదమైనంత అల్పం. ఇటు కన్ను తెరిచి అటు మాయమయేటంత ప్రిదిలిపోయే సరుకు, ఈ స్వల్ప వ్యవధిలోనే కొన్ని లక్షల తరాల సంక్షేమాన్ని, కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాపాడే ఈ భూమిని ఎంత అనా లోచితంగా, స్వార్ధపూరితంగా, ముందు చూపులే కుండా దుర్వినియోగం చేస్తున్నాడో తలుచుకుంటే - ఇది నేనన్న మాట కాదు- మానవునికీ చెద పురుగుకీ తేడా లేదు. ఇది క్రూరమయిన ఉపమానం కావచ్చు. కాని ఇదే నిజం. అయితే ఇవన్ని మాటల్లో స్వతంతర్ కుమార్ చెప్పలేదు.
ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులు, స్వార్థ పరులు ఆక్సిజన్ సిలెండర్లు వ్యాపారంలోకి దిగితే? బజార్లో అమ్మకానికి పెట్టే ఈ సిలెండర్లలో ఉండవల సినంత సరుకు లేకుండా అమ్మితే? ఆక్సిజన్ని కలుషితం చేస్తే? నిద్రపోయే పక్క ప్రయాణికుడి సిలెండర్‌ను దొంగ ఎత్తుకుపోతే? అల్లుడుగారికి కట్నంగా 60 స్వచ్ఛమైన ఆక్సిజన్ సిలెండర్లను మామగారు పిల్లతో సహ బహూకరిస్తే? మంత్రులకు, వారి చెంచాలకు ఉచితంగా లెక్కలేనన్ని సిలెండర్ల పంపిణీని చట్టబద్ధం చేస్తే? సిలెండర్ల గొడౌన్లలోనే కుంభకోణం జరిగితే?
తెలుగు భాషకీ కొత్త నుడికారం వస్తుందని నా నమ్మకం. ఎవరైనా సహాయం చేస్తే, ‘‘ఆహా! సమ యానికి రామారావు ఆక్సిజన్ సిలెండర్లాగ తారసపడ్డా డయ్యా’’. ఎవరైనా నిష్టూరంగా ప్రవర్తిస్తే: ‘‘ఒరేయ్! చేతనయితే ఆక్సిజన్ సిలెండర్వికా. అంతేకాని ఖాళీ సిలెండర్లా వీపుమీద స్వారీ చెయ్యకు’’, ‘‘ఈ గోవింద రావు చిల్లులు పడిన సిలెండరు లాంటివాడు. బయటికి కనిపిస్తాడు. కాని లోపల ఉత్త డొల్ల.’’
ఇన్ని విషయాల్ని ఇంతగా వివరించి చెప్పలేని ఆ కాలపు పెద్దలు, ఇంతగా చెప్పవలసిన రోజులు వస్తాయని తెలీక ‘‘ఈ భూమి దేవత. దాన్ని గౌరవిం చండి. కూల్చిన ప్రతీ చెట్టుకీ ప్రాయశ్చిత్తం చేసి ప్రత్యా మ్నాయాన్ని కల్పించండి’’ అని మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మన నాయకులు లక్షల, కోట్ల మొక్కల్ని నాటించడమే పనిగా రంగంలోకి దూకారు. కెమెరాలు పోటీలు పడి చూపుతున్నాయి. నాటడం వరకూ బాగానే ఉంది. కాని అవి బతకడానికి నీరు? బతికించే నాథుడు?
గడిచే ప్రతీ నిమిషం ఈ భూమి మీద మానవుడు సజావుగా బ్రతికే ఒక తరం వనరుల్ని ధ్వంసం చేస్తోం దట. రాబోయే కాలంలో లాభసాటి వ్యాపారం అంద మైన, చూడముచ్చటయిన, నాజూకు అమ్మాయిలూ మోసుకు తిరగగల, మంచి డిజైన్లలో ఆక్సిజన్ సిలెం డర్లు మార్కెట్లోకి వస్తాయి.
అంతేకాదు. వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీచేసే ఆక్సిజన్, చిల్లు సిలెండర్లు, టోకు వ్యాపారం, సిలెండర్ పేలుళ్లు, కాంట్రాక్టుల్లో కుంభకోణాలు. 2జి కుంభ కోణం వీరుడు ఏ.రాజాగారి అబ్బాయి ఇప్పటినుంచే ఆ ప్రయత్నంలో ఉంటారని నా నమ్మకం.
(వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు)