'రూ.50 కోట్లతో వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి'
-తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి మార్కెట్లకు జాతీయస్థాయి గుర్తింపు
-ధారూరు మార్కెట్ అభివృద్ధికి రూ. 2 కోట్లు
-రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి
ధారూరు : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు కేటాయించామని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని స్టార్ పంక్షన్హాలులో జరిగిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో కొత్తగా కోట్పల్లి, బషిరాబాద్, కులకచర్ల, మహేశ్వరం వ్యవసాయ మార్కెట్లను మంజూరు చేసినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. కొత్త మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల చొప్పున కేటాయించామని, ధారూరు మార్కెట్కు కూడ రూ. 2 కోట్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.
జిల్లాలోని తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 44 వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలోని 1146 చెరువులకు రూ. 385 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అలాగే బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణ పనులకు రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మంజూరు అవుతేన్నాయని అన్నారు.
అలాగే తాండూర్-వికారాబాద్ వయా ధారూరు మీదుగా ఉన్న డబుల్ లైన్ రోడ్డును ఫ ఓర్లైన్స్ రోడ్డుగా మార్చడానికి రూ. 40 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుగా చేసి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ధారూరు మండలానికి ఎస్సీ, ఎస్టీలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేయిస్తామని మంత్రి హామి ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అంశం తన పరిధిలో లేదని డిప్యూటి సీఎంను కలసి కళాశాల మంజూరు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.