అనుమతి లేకుండా రైతుల భూముల్లోకి వెళ్లొద్దు
అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఐఎస్) రీ డిజైనింగ్ పేరుతో రైతుల భూముల్లో వారి అనుమతి లేకుండా ఎలాంటి సర్వే నిర్వహించరాదని హైకోర్టు సోమవారం రెవెన్యూ అధికారులను, నవయుగ కంపెనీ సిబ్బందిని ఆదేశించింది. రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లోకి ప్రవేశించడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ సర్వే చేయాలనుకుంటే చట్ట నిబంధనలకు లోబడి ఆ ప్రక్రియను పూర్తి చేయాలంది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్ఎల్ఐఎస్ రీ డిజైనింగ్‌లో భాగంగా తమ భూముల్లో నవయుగ కంపెనీ సర్వే నిర్వహిస్తోందని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రైతులు అప్పీల్ దాఖలు చేయగా సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది శశికిరణ్ వాదనలు వినిపిస్తూ సర్వే విషయంలో పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడం గానీ, వారి అనుమతి తీసుకోవడంగానీ చేయలేదన్నారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది టి.శరత్, నవయుగ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది.