ఐదేళ్లకోమారు ఎన్నికలంటే చట్టం మార్చాలి
స్థానిక సంస్థల పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల మాదిరిగా స్థానిక సంస్థలకూ క్రమం తప్పకుండా ఐదేళ్లకోమారు ఎన్నికలు నిర్వహించాలంటే.. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని, అది రిజర్వేషన్లు ప్రకటిస్తే తప్ప.. తాము ఎన్నికల నిర్వహణకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ప్రతీ ఆర్నెల్లకో మారు వాయిదా వేసుకొంటూ పదేళ్లపాటు నిర్వహించకుండా వెళ్లే అవకాశం ప్రభుత్వానికి ఉందని ఆయన వివరించారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకోవడానికి అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగిస్తే తప్ప ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల తరుణంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమాకాంత్‌రెడ్డి వెల్లడించిన ముఖ్యాంశాలు...
ప్రజా ప్రభుత్వం ఉన్నంత కాలం స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించలేదు. పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా, అధికారులతో మాట్లాడినా ఎలాంటి స్పందనా లేదు. అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. వారి బాధ్యత ముఖ్యమంత్రికి ఫైలు పంపించడం వరకే. రిజర్వేషన్ల ఖరారుకు ముఖ్యమంత్రి అనుమతించకపోతే వారు చేసేదేముంది.
ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే తప్ప ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. ప్రత్యేక పరిస్థితులను సాకుగా చూపి ప్రతీ ఆర్నెల్లకోమారు వాయిదా వేస్తూ పదేళ్ల వరకు పొడిగించుకుంటూ వెళ్లే అవకాశం ఉంది.
్హ రాష్ట్రపతి పాలన విధించిన 24 గంటల్లోనే రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం.
రెండు రకాల ఎన్నికలు ఒకేసారి రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ఉన్నతాధికారులతోపాటు, ఎన్నికల సంఘంలోని అధికారులం కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. పనిచేసే సమయం పెంచుకుని ఎన్నికలు సజావుగా సాగడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి తేదీలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. రెండు దశల్లో ఎన్నికలు ఏ ప్రాంతంలో ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయించాం. సుప్రీంకోర్టు తీర్పు చూసిన తరువాత వాటిని ప్రకటిస్తాం.