జాతరమ్మో..జాతర!
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతి తాతయ్యగుంట గంగ జాతర మంగళవారం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం అర్దరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. మణిమయ స్వర్ణ మకుటాన్ని ధరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సప్పరాల సందడి
జాతరలో భాగంగా చివరి రోజైన మంగళవారం నాడు భక్తులు సప్పరాలు మోసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. వెదురు దబ్బలతో గోపుర ఆకారంలో సప్పరాలు తయారు చేస్తారు. శరీర ఆకృతికి అనుగుణంగా తయారు చేసిన సప్పరాలను నేల వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒంటికి ఊతంగా గుచ్చుకుని తలపై ధరిస్తారు.
రేపు అమ్మవారి ప్రతిమ చెంప తొలగింపు
శ్రీతాతయ్యగుంట గంగ జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం వేకువజామున నిర్వహించనున్నారు. అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు జాతరలో ప్రధాన ఘట్టం. చెంప తొలగింపుతో ఏడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగిన గంగమ్మ జాతర సమాప్తం కానుంది.
విస్తృత ఏర్పాట్లు
జాతర సందర్భంగా మంగళవారం ఆలయానికి వచ్చే భక్తులకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టాం. తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. వాహనాలను తుడా ఇందిరా మైదానం, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందిరామైదానం, ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సౌత్‌గేట్ వద్ద పొంగళ్లు పెట్టుకోవచ్చు. భద్రత కోసం పోలీసు అధికారుల సహకారం తీసుకున్నాం. - పీ.సుబ్రమణ్యం, తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఈవో