రాష్ట్రం విడిపోయినా.. నీటి యుద్ధాలు రావు : సుదర్శన్‌రెడ్డి
మంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడి
రాష్ట్రం విడిపోయినా ఇప్పుడున్న కేటాయింపులే కొనసాగుతాయి
జల పంపిణీకి బోర్డులు ఏర్పడతాయి
వరదలొస్తేనే మిగులుజల ఆధారిత ప్రాజెక్టులకు నీళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం విడిపోయినా ఎలాంటి నీటి యుద్ధాలు రావని రాష్ర్ట సాగునీటి శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. నీటి పంపకాల్లో కొత్త సమస్యలు రావని, ఇప్పుడున్న కేటాయింపులనే కొనసాగిస్తారని అన్నారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు నీటిని మన రాష్ర్టంతో పాటు కర్ణాటక కూడా పంచుకుంటోందని, ఇందుకోసం ప్రత్యేక బోర్డు ఉందని గుర్తుచేస్తూ...భవిష్యత్తులో తెలంగాణ-సీమాంధ్ర రాష్ట్రాలకు జల పంపిణీకి బోర్డులు వస్తాయని అన్నారు. నీళ్లు రావనే విషయంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచించారు. అయితే మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు మాత్రం నీటి కేటాయింపులు రావని, వరదలు వచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్టులు నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనతో నీటి కేటాయింపుల్లో సమస్యలు తలెత్తుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో పరోక్షంగా విభేదించారు. ‘ఆయన (సీఎం) అభిప్రాయం అది...నా అభిప్రాయం ఇది..’ అంటూ వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయం వ్యక్తిగతమా? ప్రభుత్వ పరమైనదా? అన్న ప్రశ్నకు.. ఒక మంత్రిగా చెప్తున్నానని అన్నారు. పోలవరానికి నీరు రాదనే ప్రచారాన్ని నమ్మవద్దని గోదావరి జిల్లాల ప్రజలకు సూచించారు. కృష్ణా డెల్టాకు కూడా ఎలాంటి సమస్య రాదన్నారు.
మిగులు జలాలపై ఆధార పడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ (ఎస్ఎల్బీసీ), తెలుగుగంగ, వెలుగొండ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎలా? అన్న ప్రశ్నకు మాత్రం మంత్రి సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ కొత్త తీర్పు అమల్లోకి వస్తే దిగువకు వరదనీరు రావడం కూడా కష్టమవుతుంది కదా? అన్న ప్రశ్నకూ సుదర్శన్‌రెడ్డి సరైన వివరణ ఇవ్వలేదు. కృష్టా, గోదావరి నదుల నుంచి ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, ఈ నీటితో ప్రాజెక్టుల అవసరాలను తీర్చవచ్చని అన్నారు. విలేకరుల సమావేశానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వరరావులతోపాటు అంతరాష్ట్ర జలవనరుల విభాగం సీఈ రవూఫ్ తదితరులు హాజరయ్యారు. అయితే వీరంతా వేదిక దిగువున కూర్చున్నారు.