హలో... కలెక్టర్‌గారు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను పరిష్కరించే నిమిత్తం సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 20 మంది వరకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. వాటిలో కొన్ని.. శ్రీకాకుళం పట్టణంలోని నక్కలవీధిలో తాగునీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని స్థానికులు కొంతమంది కోరగా పురపాలక కమిషనర్‌ను చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నరసన్నపేట మండలం కొత్తపాలవలస సర్పంచ్ తిరుమలరావు గ్రామంలో ఉన్న మంచినీటి బోరు పనిచేయడం లేదని మరమ్మతులు చేపట్టాలని కోరారు. కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని హిరమండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన ఏవీ సురేష్ కోరారు. పెనుగొట్టివాడ వద్ద ఫ్లడ్వాల్ను నిర్మించాలని కొత్తూరు మండలం మాతల గ్రామానికి చెందిన బి. రామప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.
పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని శ్రీకాకుళం పీఎన్‌కాలనీ నుంచి పి. వెంకటేశ్వరరావు, ఆమదాలవలస 13వ వార్డు నుంచి పి. శ్రీనివాసరావు, నందిగాం మండలం హరిదాసుపురం నుంచి పి. నేతాజీ, మందస మండలం హరిపురం గ్రామం నుంచి జి. మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. చౌకధరల దుకాణం నెం-2 డీలర్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయని అతనిపై చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండలం నివగాంకు చెందిన వేణుగోపాలరావు కోరారు. గ్రామానికి చెందిన ఎ. అప్పారావు, పట్నాన అప్పారావులకు గత ఆరు మాసాలుగా రేషన్‌ను మంజూరు చేయడం లేదని పొందూరు మండలం ఖాజీపేట నుంచి పి. రాజారావు ఫిర్యాదు చేశాడు. టెక్కలి మండలం పెద్దసాన గ్రామం నుంచి పి. అప్పన్న మాట్లాడుతూ చౌకధర దుకాణం నెం. 793ను బినామీ నడుపుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజేసీ ఎం హెచ్ షరీఫ్, డీఎంహెచ్‌వో గీతాంజలి, ఆర్డబ్యూఎస్ పీడీ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.