పొట్టకూటికోసం వెళ్లి మృత్యుఒడికి
బుట్టాయగూడెం : ఉపాధి కోసం కర్నూలు జిల్లా తిప్పయ్యపాలెం వెళ్లిన గిరిజనుల్లో ఒకవ్యక్తి శుక్రవారం మరణించాడు. ఈ విషయాన్ని అక్కడకు వెళ్లి తోటి గిరిజనుడు ఫో¯ŒS చేసి చెప్పినట్టు ఎంపీటీసీ సభ్యుడు కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇటీవల మండలంలోని పడమరరేగులకుంట గ్రామం నుంచి ఏడుగురు గిరిజనులు చేపలు పట్టే ఉపాధి కోసం కర్నూలు జిల్లా తిప్పయ్యపాలెం వెళ్లారు. అక్కడ ఏమైందో ఏమో తెలియదుగానీ వెళ్లిన వారిలో మడకం ముత్యాలు మరణించినట్టు అక్కడ ఉన్న వారు సమాచారం ఇచ్చారు. ముత్యాలు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రెడ్డిగణపవరం నుంచి 10 మంది గిరిజనులు చేపలు పట్టేందుకు కర్నూలు జిల్లా వెళ్లి అక్కడ వెట్టిచాకిరీ చేయలేక ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. వారంతా పోలీసుల జోక్యంతో ఇటీవల క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అయితే రేగులకుంట గిరిజనులు మాత్రం అక్కడే ఉండిపోయారు. వీరిలో ముత్యాలు మృతి చెందగా. మిగిలిన ఆరుగురు అక్కడే ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ ఉన్న వారిని తక్షణం గ్రామానికి తీసుకొచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని రేగులగుంట గ్రామస్తులు కోరుతున్నారు.