అమ్మ కోసం.... 2వేల మంది పాదయూత్ర
పళ్లిపట్టు : అమ్మ విడుదల కోసం రెండు వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు తిరుత్తణికి పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం జయలలిత కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. జయకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు 8 రోజులుగా విభిన్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు తాలూకాలోని ఆర్కే.పేట నుంచి తిరుత్తణి కొండకు 2 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలతో పాదయాత్ర చేశారు. శుక్రవారం ఉదయం ఆర్కే.పేట బజారు నుంచి ప్రారంభమైన పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వ న్యూఢిల్లీ మాజీ ప్రత్యేక ప్రతినిధి నరసింహన్ అధ్యక్షత వహించారు. అన్నాడీఎంకే మద్దతు డీఎండీకే రెబెల్ ఎమ్మెల్యే అరుణ్సుబ్రమణ్యం సమక్షంలో ఈ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భారీగా గ్రామీణ మహిళలు తరలిరావడంతో తిరుత్తణి షోళింగర్ రాష్ట్ర రహదారి కిక్కిరి సింది. తిరుత్తణికి చేరుకున్న వారు సుబ్రమణ్యస్వామికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ఆ పార్టీ నాయకులు వేలంజేరి చంద్రన్, యూనియన్ చైర్మన్ ఇళంగోవన్, జిల్లా కౌన్సిలర్ పాండురంగన్, ఉత్తండన్, జయరామన్, బలరామన్, గ్రామ పంచాయతీల అధ్యక్షుల సంఘం అధ్యక్షుడు వేలాయుధం పాల్గొన్నారు.
నిరాహార దీక్ష
పళ్లిపట్టులో నిరాహార దీక్ష : జయలలితకు మద్దతుగా పళ్లిపట్టు యూ నియన్ అన్నా డీఎంకే ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల ప్రాంతంలో నిరాహార దీక్ష చేశారు. దీక్షకు ఆ పార్టీ యూనియన్ కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్ అధ్యక్షత వహించారు. యూని యన్ చైర్మన్ శాంతిప్రియా సురేష్ స్వాగతం పలికారు. ఇందులో 500 మందికి పైగా అన్నాడీఎంకే నాయకులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాసన్ మాట్లాడుతూ రాజకీయ కక్షలతో జయలలితపై కేసు మోపి దోషిగా తీర్పు ఇచ్చి జైలు పాలు చేశారని విమర్శించారు. అయితే న్యాయస్థానం ద్వారానే అమ్మ నిర్దోషిగా బయటపడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీక్షలో యూనియన్ వైస్ చైర్మన్ జయవేలు, యూనియన్ కౌన్సిలర్లు కరుణాకరన్, ఏకాంబ రం, సెల్వి శరవణన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి షణ్ముగం, కరింబేడు కుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.