Paddy Culture
-
గ్రీన్ రెవల్యూషన్తోనే కాలుష్యం!?
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట దుబ్బులను తగుల బెట్టడం వల్ల ఢిల్లీ నగరాన్ని కాలుష్య భూతం కమ్ముకుంది. ఈసారి గాలులు మందగమనాన్ని మించకపోవడం, టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల కాలుష్య కణాలు దిగువ వాతావరణంలోనే స్థిరపడిపోయి ఇటు ఢిల్లీ వాసులనే కాకుండా అటు ఉత్తరాది ప్రాంతంవైపు కూడా ప్రయాణిస్తూ అక్కడి ప్రజలనూ భయకంపితుల్ని చేస్తున్నాయి. అసలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఎందుకు పంట దుబ్బులను తగులబెడుతున్నారు. అందుకు కారణాలేమిటీ? ఒకప్పుడులేని ఈ పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? గ్రీన్ రెవల్యూషన్ నుంచే వచ్చిందా? అసలు గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? దాని వల్ల ప్రజలకు కలిగిన లాభాలేమిటీ, నష్టాలేమిటీ? పంట దుబ్బులను తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఉంటే అవేమిటీ? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సరైన, స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. 1960 ప్రాంతంలో భారత్‌కు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అమెరికా సరఫరా చేసే ఆహార పదార్థాలపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. దేశంలో ఆహారోత్పత్తిని బాగా పెంచాలని అప్పటి భారత ప్రభుత్వం భావించింది. అందుకు వ్యవసాయ సంస్కరణలు అవసరమని రెండు కమిటీలు అభిప్రాయపడ్డాయి. ఒక కమిటీ వ్యవసాయ రంగంలో తీసుకరావాల్సిన సాంకేతిక మార్పులను సూచించగా, సామాజిక మార్పులు అవసరమని మరో కమిటీ అభిప్రాయపడింది. ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు హైబ్రీడ్ విత్తనాలను ప్రవేశపెట్టాలని సాంకేతిక కమిటీ సూచించింది. ఎక్కువ దిగుబడి నిచ్చే వంగడాలను ప్రవేశపెట్టాలని 1961లో అప్పటికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సూచించారు. ఖరీదైన విత్తనాలను, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, వీటి విషయంలో రైతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడమే కాకుండా రైతుల పెట్టుబడులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. చర్చోపచర్చల అనంతరం దీన్ని అమలు చేయాలని 1964లో అప్పటి వ్యవసాయ మంత్రి సీ. సుబ్రమణియం నిర్ణయించారు. ఈ విధానం వల్ల పెద్ద రైతులు బాగు పడతారని, వినియోగదారులు నష్టపోతారని ప్రతిపక్షాలు గొడవ చేశాయి. దాంతో ప్రతిపాదన అటకెక్కింది. ఆహార సహాయంపై అమెరికా ఆంక్షలు భారత ప్రజలకు తేరగా ఆహారాన్ని సాయం చేయడానికి తాము సిద్ధంగా లేమని 1965లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బీ జాన్సన్ ప్రకటించి ఆంక్షలు విధించారు. 1966 నుంచి తాము నిల్వ ఉండే ఆహార పదార్థాలకు బదులుగా రెడీమేడ్ ఆహార పదార్థాలను పంపిస్తామంటూ ‘షిప్ టూ మౌత్’ పాలసీని ప్రకటించారు. అదే సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్క చేయకుండా గ్రీన్ రెవెల్యూషన్‌ను అమలు చేశారు. ఏడాది కాలంలోనే గోధుమ పంట 40 శాతం పెరిగింది. అంటే 120 లక్షల టన్నుల నుంచి 170 లక్షల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత వరి ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. గ్రీన్ రెవల్యూషన్ కాలాన్ని 1965 నుంచి 1980 వరకని పేర్కొనవచ్చు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను వాడేందుకు పలు రాష్ట్రాల్లోని రైతులు నిరాకరించారు. సంప్రదాయ వంగడాలకే వారు మొగ్గు చూపారు. అప్పటి వరకు గోధుమ పంటలకే అలవాటు పడిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ వరి వంగడాలను వాడేందుకు ముందుకు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం రైతులు కూడా సరేనన్నారు. జాతీయంగా వరి ఉత్పత్తిలో 1960లో పంజాబ్ వాటా 0.7 శాతం ఉండగా, 1979 వరకల్లా దాని వాటా ఏడు శాతానికి చేరుకుంది. ఓ పంట వరి, మరో పంట గోధుమ (ఆర్డబ్లూసీఎస్) వేసే విధానాన్ని అమలు చేయడంతో అమోఘ ఫలితాలు వచ్చాయి. హర్యానా కూడా పంజాబ్‌తో పోటీ పడుతూ వచ్చింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు వరి సంప్రదాయ వరి వంగడాలకు భిన్నంగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను జూన్‌లో వేస్తే అక్టోబర్‌లో పంట చేతికి వస్తోంది. మళ్లీ అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలోనే గోధుమలను వేయాల్సి ఉంటుంది. ఇరు పంటల మధ్య వ్యవధి ఉండేది 15 రోజులే. ఈ రోజుల్లో వరి పంట నూర్పుడు అయిపోవాలి. వరి దుబ్బును తొలగించాలి. రెండో పంట గోధుమకు పొలాన్ని సిద్ధం చేయాలి. దుబ్బును తగులబెట్టడానికి సవాలక్ష కారణాలు వరి దుబ్బును తొలగించడానికి కూలీలు దొరకరు. దొరికినా చాలా ఖర్చు. ఎకరాకు ఆరేడు వేల రూపాయలు అవుతుంది. మన మసూరు బియ్యం లాగా పంజాబ్, హర్యానాలో పండించే విదేశీ వంగడం ఉండదు. ఏపుగా పెరుగుతుంది. భూమిలో బలంగా పాతుకు పోతుంది. లాగితే ఓ మానాన రాదు. వాటి పొలుసు చాకులా ఉండడం వల్ల లాగేటప్పుడు గీసుకుపోయి రక్తం కారుతుంది. మిగతా వరిదుబ్బును ఇష్ట పడినట్లు ఈ రకం దుబ్బును పశువులు అంతగా ఇష్టపడవు. పశు గ్రాస మార్కెట్లో దీన్ని ఎవరూ కొనరు. రైతుకు రవాణా ఖర్చులు కూడా రావు. ఈ దుబ్బును ఇంటి పశువులకు వేయాలంటే కొన్ని తరాలుగా ఇక్కడి రైతులు పశువులకు బదులుగా యంత్రాలనే వాడుతున్నారు. ఇప్పుడు దుబ్బును కోసే ధ్వంసంచేసే యంత్రాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అవి ఖరీదైనవి. అద్దెకు ఇంకా అందుబాటులోకి రాలేదు. భారీ ఎత్తున వ్యవసాయం చేసే రైతులు, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. స్వతంత్ర రైతులు ఉపయోగించడం లేదు. అలాంటి వారు ఒక్క పంజాబ్ రాష్ట్ర రైతుల్లో 25 శాతం మంది ఉన్నారు. వారు పొలంలో కిరోసిన్ పోసి తగుల బెడితే తెల్లారే సరికి మొత్తం వరి దుబ్బు మాయం అవుతుంది. వారే కాలుష్యానికి కారణం అవుతున్నారు. 1980 తర్వాతే ఈ పద్ధతి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. (గమనిక: సిద్ధార్థ్ సింగ్ రాసిన ‘ది గ్రేట్ స్మాగ్ ఆఫ్ ఇండియా’లోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
నిండా ముంచిన ‘స్వర్ణ’
* నీటి ముంపుతో కుదేలైన వరి రకం * వరుస తుపాన్లతో డెల్టా రైతుకు తీవ్ర నష్టం * డెల్టాకు నీటి విడుదల జాప్యంతోనూ దెబ్బ * ముంపు తట్టుకునే రకాల ఆవశ్యకత సాక్షి, హైదరాబాద్: సమయానికి విడుదల కాని కాల్వ నీరు... మరోవైపు అనువుగాని ‘స్వర్ణ’రకం వరి సాగు కారణాల వల్లే డెల్టా రైతు నిండా మునిగాడు. ‘స్వర్ణ’లాంటి అననుకూల రకాలను సాగు చేయడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగితే, కృష్ణా డెల్టాకు నీటి విడుదలలో ఆలస్యం కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్టం కలిగింది. గోదావరి జిల్లాల్లో కూడా కాల్వల ఆధునీకరణ పనులు, మరమ్మతులు లాంటి కారణాలతో కాస్త ఆలస్యంగా నీరు అందిన గ్రామాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. తుపాను సమయానికి కోతలు పూర్తికాని ‘స్వర్ణ’ వరి పూర్తిగా దెబ్బతింది. ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 వరి రకాల్లో నష్టం తక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో పర్యటించిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం పరిశీలనలో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జూన్ 13న నీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, కాళ్ల, ఉండి, భీమవరం తదితర మండలాల పరిధిలోని కాల్వల ఆధునీకరణ పనుల కారణంగా ఈ ప్రాంతాల్లో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. ఇలా ఆలస్యమైన చోట సాగైన ‘స్వర్ణ’ రకం వరి వరుస తుపాన్లకు పూర్తిగా దెబ్బతింది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కాల్వలకు నీళ్లు వచ్చే సమయానికే బోర్ల కింద నారుమళ్లు సాగు చేసుకుని జూన్ చివరి వారంలోపు నాట్లు వేశారు. ఈ పంటంతా తుపాన్ల నుంచి బయట పడింది. నాట్లు ఇంకొంత ఆలస్యమైన చోట తుపాను సమయానికి కోతలు పూర్తయ్యి కుప్పలు పడ్డాయి. ఇక్కడా నష్టం స్వల్పంగానే ఉంటుంది. నాటు ఇంకా ఆలస్యమైన ప్రాంతాల్లో ప్రధానంగా ‘స్వర్ణ’రకం తుడిచిపెట్టుకు పోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణా డెల్టా కింద దాదాపు 32 వేల ఎకరాల్లో వరి సాగు ఉంది. ఇక్కడ అక్టోబర్ మూడో వారంలో కానీ నాట్లు పడలేదు. తుపాను దెబ్బకు ఈ సాగు అంతా దెబ్బతింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 70 శాతం విస్తీర్ణంలో ‘స్వర్ణ’ రకం వరే సాగు చేశారు. తుపాను సమయానికి కోతలు పూర్తికాని అన్ని చోట్లా ఆ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో 70 శాతం అంటే దాదాపు 8 లక్షల ఎకరాల్లో ‘స్వర్ణ’ రకమే సాగయ్యింది. దీనికి తుపానులతో త్వరగా పైరు పడిపోయే స్వభావం ఉంటుంది. రెండు మూడు రోజుల ముంపుకే గింజ మొలకెత్తుతుంది. కృష్ణా నీటి విడుదలలోనూ జాప్యమే ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి చివరి ప్రాంతానికి ముందు నీటిని వదలి, అక్కడ నుంచి పై ప్రాతాలకు నీటిని విడుదల చేస్తూ వస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ విధానం తలకిందులుగా అమలయ్యింది. జూలై 22న జూరాల నుంచి నీరు విడుదల చేశారు. జూలై 28న పోతిరెడ్డిపాడుకు నీరు విడుదలైంది. ఆగస్టు 2న సాగర్ కాల్వకు, 6న సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా నీటి విడుదలలో జరిగిన జాప్యానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. తుపాను తీవ్రత తక్కువ ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బ తింది. ‘హెలెన్’తో పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ పేర్కొన్న వివరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఇందులో 83 వేల ఎకరాల్లో తుపాను సమయానికే పంట రైతుల ఇళ్లకు చేరిపోయింది. పనలపై 91 వేల ఎకరాల్లో, కుప్పలేసిన వరి 94 వేల ఎకరాల్లో నీటి ముంపులో ఉంది. తుపాను ధాటికి 2.93 లక్షల ఎకరాల్లో వరి పడిపోయింది. కుప్పలేసిన వరిలో నష్టం పెద్దగా ఉండదు. పనలపైన, పడిపోయిన వరిలోనే నష్టం అధికంగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనలపైన కానీ, కుప్పలేసిన వరి కానీ ఒక్క ఎకరా కూడా లేదు. గింజ గట్టిపడే దశలో ఉన్న దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి చేతికందకుండా పోయింది. ఇక్కడ ప్రధానంగా బీపీటీ 5204 రకం తుపానుకు ఎక్కువ దెబ్బతింది. మార్టేరు వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పీవీ సత్యనారాయణ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కీటక శాస్త్ర శాఖాధిపతి డాక్టర్ రమేష్ బాబు, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త పి.నారాయణ రెడ్డి, సీడ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ కేశవుల బృందం ఇటీవల తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించింది. ‘స్వర్ణ’ వద్దు... ఎంటీయూ 1121 మేలు ‘‘నీటి విడుదలలో అనిశ్చితి, ఎప్పుడు తుపాన్లు వస్తాయో చెప్పలేని పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి డెల్టాల్లో ‘స్వర్ణ’, బీపీటీ-5204 లాంటి రకాల సాగు మంచిది కాదు. నమ్మకమైన దిగుబడి, గింజ నాణ్యత ఉండటం తదితర లక్షణాలు ఉన్నా, తుపాన్లకు ఇవి తట్టుకోలేవు. మూడు, నాలుగు రోజులు నీటి ముంపులో ఉంటే గింజ మొలకెత్తుతుంది. డెల్టాలో ఈ రకాలు సాగు చేయడం అంటే ‘గాలిలో దీపం పెట్టినట్లే’. ఎంటీయూ 1121 అనే కొత్త వంగడం ఈ ప్రాంతంలో సాగుకు అన్నివిధాలా సరిపోతుంది. 125 రోజుల్లో కోతకొస్తుంది. అగ్గితెగులును తట్టుకుంటుంది. అన్నిటికీ మించి రెండు వారాలపాటు నీటిలో ఉన్నా గింజ మొలకెత్తదు.’’ - పీవీ సత్యనారాయణ, మార్టేరు వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త