అధికారిక సమావేశాల్లో పతి‘దేవుడు’
- ‘సమీక్ష’లకు హాజరు
- చర్చనీయాంశమైన పద్మాదేవేందర్‌రెడ్డి భర్త తీరు
- అధికారిక కార్యక్రమంలోఅనధికారి..!
- ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అధికార పార్టీనేత
- మీడియాకు నో ఎంట్రీ... అంటూనే మరికొంతమందితో సమీక్ష
మెదక్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమం షెడ్యూల్లో భాగంగా శుక్రవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒకరోజు ముందే ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను స్థానిక డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాప్రతినిధులకు అధికారికంగా సమాచారం అందించారు. అయితే ఎప్పటిలాగే సీన్ రివర్స్ అయింది.
మీటింగ్ హాల్లో కొద్దిసేపు నిరీక్షించిన విలేకరులకు స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ భర్త దేవేందర్‌రెడ్డి స్వయంగా వచ్చి ఇది అధికారిక సమీక్షా సమావేశమని, మీడియాకు అనుమతి లేదని చెప్పడంతో అక్కడున్న కొందరు విలేకరులు అవాక్కయ్యారు. కొంతమంది విలేకరులు అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొంతమంది సమావేశంలో పాల్గొనడం గమనార్హం. అధికారికంగా జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్‌రెడ్డి దర్జాగా కూర్చున్నారు. కేవలం ఉపసభాపతి భర్త అయినంత మాత్రాన ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన ఏడుపాయల జాతర సమీక్ష సమావేశంలో సైతం ఆయన పాల్గొన్నారని ధ్వజమెత్తారు.