విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. పిల్లల వైద్యుడి అరెస్టు
కేరళలో ఎండీ చదువుతున్న విద్యార్థినికి అసభ్య చిత్రాలు, మెసేజీలు పంపుతూ లైంగికంగా వేధిస్తున్న పిల్లల వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని సేలం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్ (46)ను తమిళనాడు మహిళల వేధింపుల చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఎ సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు సేలం నగర పోలీసు కమిషనర్ ఎ. అమల్రాజ్ తెలిపారు.
మొదట్లో ఆమె ఇక్కడ చదివేదని, అప్పట్లోనూ అతడు వేధించినా.. పెద్దగా పట్టించుకోకుండా వదిలేసిందని కమిషనర్ చెప్పారు. తర్వాత ఆమె కాలికట్ వైద్య కళాశాలలో ఎండీ కోర్సులో చేరింది. ఇక ఇప్పటికే పెళ్లయ్యి.. పిల్లలు కూడా ఉన్న ఆ వైద్యుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ఆమెను లైంగికంగా వేధిస్తూ, మొబైల్ ఫోన్కు మెసేజీలు పంపడం కొనసాగించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సెంథిల్ కుమార్ను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.