రైతు ఆత్మహత్యలు 88 కాదు.. వెయ్యి!
పార్లమెంటులో తప్పుడు ప్రకటనపై రైతు రక్షణ సమితి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గతేడాది కేవలం 88 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పార్లమెంటులో ప్రకటించడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఒక ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో గత ఏడా ది ఏకంగా వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 130 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభు త్వ యంత్రాంగం మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉందనీ, ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపెడుతోందని మండిపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా రైతుల తలరాత మారలేదన్నారు.