పలాస జీడిపప్పుకు విభజన సెగ..!
సాక్షి, పలాస: జీడిపప్పు ఉత్పత్తిలో జాతీయస్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస మార్కెట్‌కు రాష్ట్ర విభజన దెబ్బ తగిలింది. పలాస నుంచి హైదరాబాద్‌కు జీడిపప్పు ఎగుమతులు నిలిచిపోతున్నాయి. గతంలో ఒక శాతం టీఓటీ(టర్నోవర్ ట్యాక్స్)తో పలాస నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా హైదరాబాద్‌కు రవాణా చేసేవారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే జీడిపప్పు వినియోగదారులు ఎక్కువగా ఉండేవారు. రోజూ పలాస నుంచి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల ద్వారా జీడిపప్పు రావాణా అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు హైదరాబాద్‌కు జీడిపప్పు రవాణా చేయాలంటే ఒక శాతం టీఓటీ పన్నుకు బదులు 5 శాతం వ్యాట్ చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు విజయవాడ తరువాత హైదరాబాద్ వరకు పలుచోట్ల చెక్‌పోస్టులు పెట్టడంతో వాటి చార్జీల భారం కూడా పడుతోంది.
దీనికి తోడు ఈ నెల 25 నుంచి రైల్వే రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. పలాస నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు సుమారు 27 టన్నుల జీడిపప్పు ఎగుమతి చేస్తుంటారు. టన్ను విలువ రూ.35 లక్షలు. ఈ లెక్కన మొత్తం సరుకు విలువ రూ.9.45 కోట్లు అవుతుంది. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో ఒక శాతం టీఓటీ అంటే రూ.9.45 లక్షలు చెల్లిస్తే.. ఇప్పుడు వ్యాట్ రూపంలో దానికి ఐదు రెట్లు.. అంటే రూ.47.25 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. మారిన పరిస్థితులు, ముడిసరుకు కొరత తదితర కారణాలతో పలాస జీడిపరిశ్రమ నేడు కష్టాల్లో చిక్కుకుంది.
విదేశీ పిక్కలపైనే ఆధారం...
స్వదేశీ పిక్కలు ఇక్కడి పరిశ్రమల అవసరాలకు సరిపోవడం లేదు. ఉద్దానం ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల్లో జీడి పంట సాగవుతుంది. సగటున 5 లక్షల క్వింటాళ్ల జీడిగింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా సుమారు 3 లక్షలు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పలాస పరిసరాల్లో సుమారు 300 జీడి పరిశ్రమలు ఉండగా, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 300 పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికి ముడిసరుకు ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలోని సీతంపేట, పాలకొండ తదితర ప్రాంతాల నుంచి సరఫరా అవుతుంది. దాంతో పలాస జీడిపరిశ్రమదా రులు ఉద్దానం ప్రాంత పిక్కలతో పాటు విదేశీ పిక్కలపై ఆధారపడుతున్నారు.
ఆఫ్రికా దేశాలతోపాటు ఇండోనేషియా వంటి దేశాల నుంచి సుమారు 5 లక్షల క్వింటాళ్ల జీడి పిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవాళీ పిక్కల ధర బస్తా రూ.6,400 పలుకుతుండగా విదేశీ పిక్కలు రూ.5,600కే లభిస్తున్నాయని పలాస కాష్యూ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(పీసీఎంఎ) కోశాధికారి కేవి శివక్రిష్ణ చెప్పారు. కేరళకు చెందిన పలు కంపెనీలు పలాస మార్కెట్‌కు జీడిపిక్కలను విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాయని, వారి నుంచి ఇక్కడ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. మరోవైపు ప్రస్తుత జీడిపిక్కల ధరకు తగ్గట్టు మార్కెట్లో జీడిపప్పు ధరలు లేవు.
గత నెల కిలో జీడిపప్పు రూ.480 ఉండగా నేడు 460 రూపాయలకు తగ్గింది. నంబర్ వన్ రకాలు ప్రస్తుతం మార్కెట్లో లభించడం లేదు. ఇదిలా ఉండగా జీడి పప్పు విషయంలో దేశంలో ఒకే పన్ను విధానం లేదు. పొరుగు రాష్ట్రాల్లో పన్ను వెసులుబాటు ఉండటంతో అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు జీడి పప్పు ఎగుమతి అవుతోందని పలాస వ్యాపారులు చెబుతున్నారు. ఏకరూప పన్ను విధానం అమలుచేస్తే పలాస జీడి పప్పుకు మంచి గిరాకీ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.