వోల్వో బస్సు బోల్తా.. ఐదుగురి మృతి
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్/సాక్షి, నెల్లూరు: పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే మరో వోల్వో బస్సు ప్రయాణికుల పాలిట మృత్యుశకటంగా మారింది. ఇంకో గంట గడిస్తే గమ్యానికి చేరాల్సిన వారిలో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న వోల్వో బస్సు సోమవారం తెల్లవారు జామున కర్ణాటక రాష్ర్టం హొసకోటె వద్ద బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు. మృతులందరూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసులే. మృతులు, గాయపడిన వారిలో అత్యధికులు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శని,ఆదివారాలు సెలవు కావడం తో సొంత ఊళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు.. రాజేష్ ట్రావెల్స్‌కు చెందిన (కేఏ01ఏఏ7709) బస్సు ఆదివారం రాత్రి 10గంటలకు నెల్లూరు నుంచి 52 మంది ప్రయాణికులతో బెంగుళూరుకు బయలుదేరింది. తెల్లవారు జామున 5.30 గంటలకు బెంగళూరుకు 25 కిలోమీటర్ల దూరంలోని హొసకోటె సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొంది. కొంతదూరం అలాగే రాసుకుంటూ వెళ్లి ఎడమ వైపునకు బోల్తాపడింది. ఆ తర్వాత కూడా 30మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లి నిలిచి పోయింది. దీంతో ఎడమవైపు సీట్లలో కూర్చున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రదీప్ బెంగుళూరులోని హాస్‌మాట్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందారు.
గాయపడిన వారిని సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్న ఎంవీజీ వైద్య కళాశాల, బెంగుళూరులోని కొలంబియా ఏషియా, హాస్‌మాట్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా కుక్కల గుంపు అడ్డుగా రావడంతో కొద్దిగా కుడివైపుకు తీసుకోగానే బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి కొంతదూరం దూసుకెళ్లి బోల్తాపడిందనిడ్రైవర్ వెంకటప్ప తెలిపాడు. నెల్లూరుకు చెందిన అనూష (25), విజయ్‌కుమార్(32), మానస్‌కుమార్(06), గూడూరుకు చెందిన ప్రదీప్(25), పొదలకూరు మండలం వావింటపర్తికి చెందిన ప్రసాద్(28)లను మృతులుగా గుర్తించారు.
తప్పులతడకగా ప్రయాణికుల జాబితా
బస్సులో ఎక్కిన ప్రయాణికుల జాబితా తప్పులతడకగా ఉంది. ఒకరి పేరున మూడు రిజర్వేషన్లు, జాబితాలోని ఫోన్నంబర్ల వ్యక్తులు ప్రయాణం చేయకపోవడం, ప్రయాణం రద్దు చేసుకున్న వారి వివరాలు తెలపకపోవడంతో అసలు బస్సులో ఎవరు ప్రయాణిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
రూ.లక్షఎక్స్గ్రేషియా: ఎంవీజీ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న క్షతగాత్రులను కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామన్నారు. బస్సు బీమా నుంచి కూడా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందుతుందని వెల్లడించారు.