మాకే సాయం చేయలేని మీరు రాష్ట్రాన్నెలా పాలిస్తారు?
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత ఏడాది జరిగిన వోల్వో బస్సు దగ్ధం ఘటనలో బాధితులుగా మిగిలిన 45 మందికే సాయం చేయలేని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కోట్ల మంది రాష్ట్ర ప్రజలను ఏవిధంగా పాలిస్తారని, వారికి ఏవిధంగా సాయం చేస్తారని ‘పాలెం’ బాధితులు సూటిగా ప్రశ్నించారు. సీఎం పదవికి కిరణ్ అనర్హుడని, ఆయన వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఇక్కడ బస్సు దుర్ఘటన బాధితుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ పలువురు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బాధితులకు సాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, బస్సు యాజమాన్యంపై కోర్టులో కేసు వేయాలని నిర్ణయించినట్టు తెలిపా రు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నేతృత్వంలో గురువారం అఖిలపక్ష బృందం సీఎంని కలువనున్నట్టు తెలిపారు. అనంతరం, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిసి, తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.