ఇజ్రాయిల్ జర్నలిస్టులను బహిష్కరించిన పాలస్తీనా
ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా బెత్లహమ్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ఆరాధకులు అధిక సంఖ్యలో ఆ వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకలను కవర్ చేసేందుకు ప్రపంచ మీడియా అంత అక్కడకు చేరుకుంటుంది. అయితే ఆ వేడుకలకు ఇజ్రాయెల్ జర్నలిస్టులను బహిష్కరించినట్లు పాలస్తీనా ఉన్నతాధికారులు హూకుం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక మీడియా జెరూసలెం పోస్ట్ బుధవారం ఓ కథనాన్ని వెలువరించింది. ఇజ్రాయెల్ జర్నలిస్టులు తమ ప్రాంతంలో ప్రవేశించకుండా ఇప్పటికే పాలస్తీన సరిహద్దుల్లోని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించింది.
పాలస్తీనా జర్నలిస్టుల కోరిక మేరకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు. క్రిస్మస్ వేడుకల్లో ఇజ్రాయిల్ జర్నలిస్టులు పాల్గొనరాందంటూ బెత్లహమ్లోని మంజర్ స్క్వేర్ వద్ద పాలస్తీనా జర్నలిస్టులు నిర్వహించిన నిరసన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఇప్పటికే పాలస్తీనాలో ఉన్న ఇజ్రాయిల్‌లోని పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లాలని పాలస్తీనా సమాచార శాఖ మంత్రి విజ్ఞప్తి చేసినట్లు మీడియా పేర్కొంది. తమ దేశంలో జరుగుతున్న వాస్తవాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ మీడియా వార్త కథనాలను ప్రసారం చేస్తుందని పాలస్తీనా జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.