వంద ఎకరాల్లో పాలీహౌస్‌లు
కూసుమంచి: ఖమ్మం జిల్లాలో వంద ఎకరాల్లో పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కూసుమంచిలో విలేకరులతో మాట్లాడుతూ పాలీ హౌస్‌ల ద్వారా కూరగాయల సాగుతో ఒక ఎకరంలోనే నాలుగు ఎకరాల పంటను పండించవచ్చని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీలను అందిస్తుందని పేర్కొన్నారు. ఎకరానికి రూ. 40 లక్షలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం రూ. 30 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని, జిల్లాలో ఇప్పటి వరకు 13 ఎకరాల్లో పాలీహౌస్‌లను నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో బిందుసేద్యంతో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని , రైతులు డ్రిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఉద్యాన పంటలకు పాలేరులో అనువైన భూములు..
పాలేరు నియోజకవర్గంలో ఉద్యాన పంటల సాగుకు అనువైన భూములు ఉన్నాయని, రైతులు ఈ పంటల సాగుపై దృష్టి సారించాలని డీడీ కోరారు. నియోజకవర్గంలో ఆపిల్, బెర్రీ,సీతాఫలం సాగును ప్రోత్పహిస్తున్నామని, ఈ పంటలు సాగుచేసే ైరె తులకు తగిన సబ్సిడీలు ఇస్తున్నామని అన్నారు.తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనే బోడకాకర సాగు చేస్తున్నారని దానిని మరింత పెంచడానికి ఔత్సాహిక రైతులు ముందుకు రావాలని కోరారు.
ఉద్యాన పంటల విస్తరణకు మండలానికి అధికారి..
ఉద్యానవన పంటలసాగును విస్తరించేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం ప్రతి మండలానికి ఒక అధికారితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించినట్లు డీడీ తెలిపారు. ఉద్యానవన రైతులకు 50 శాతం సబ్సిడీలతో కూరగాయల విత్తనాలను సరఫరా చేయటమే కాకుండా శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు. బిందు, సూక్ష్మ సేద్యంతో కూరగాయలను పండించాలని రైతులను కోరారు. హరితహారం ద్వారా జిల్లాలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 4 లక్ష మొక్కలను నాటుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ పాలేరు నియోజకవర్గ అధికారి బివీ రమణ తదితరులు పాల్గొన్నారు.