in palkollu
-
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ సీఐ కె.రజనీకుమార్ తెలిపారు. స్థానిక కుళాయి చెరువు గట్టు వద్ద బీ.వీ.ఆర్.టవర్స్‌లో ఐదో అంతస్తు ఫ్లాట్ నంబర్ 501లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు శుక్రవారం సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ బెట్టింగ్ నిర్వహి స్తూ ఐదుగురు పట్టుబడ్డారు. వారి నుంచి క్రికెట్ లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, సోనీ ఎల్ఈడీ టీవీ, 25 సెల్ఫోన్లు, రూ.24వేలు స్వాధీనం చేసుకున్నారు. -
హోదా కోసం పార్టీలన్నీ కలిసి పోరాడాలి
పాలకొల్లు టౌన్ : ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఒకే వేదికపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే కేంద్రం దిగివస్తుందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వెళితే రాష్ట్రం విడిపోయే విషయంలో ఏ విధమైన నష్టం జరిగిందో అదే మళ్లీ పునరావృతం అవుతుందన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం కలిసి పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చాక మాటమార్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ శేషుబాబు చెప్పారు. -
బీసీ రిజర్వేషన్లు పెంచాలి
పాలకొల్లు సెంట్రల్ : బీసీల్లో కులాలను పెంచుతున్నారేగానీ, రిజర్వేషన్లను పెంచడం లేదని బీసీ చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో నరసాపురం కన్వీనర్ రెడ్డి రాంబాబు అధ్యక్షతన జరిగిన బీసీ చైతన్య సమాఖ్య సమావేశం జరిగింది. దీనిలో శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ..కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని, వారిని బీసీల్లో చేరిస్తే మాత్రం వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బిసి చైతన్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జిల్లా కన్వీనర్‌గా పెచ్చెట్టి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షునిగా మజ్జి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కండాపు శ్రీనివాసు, ట్రెజరర్‌గా యు కనకదుర్గాప్రసాద్ మరో ఐదుగురు సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సమాఖ్య తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పాటి శివకుమార్, జిల్లా కార్యదర్శి కవురు వెంకటేశ్వరరావు, జిల్లా యూత్ అధ్యక్షులు చోడే గోపీకృష్ణ, కొవ్వూరు డివిజన్ అధ్యక్షులు ఆకుల కిరణ్, ఊడి మారెమ్మ, కుడిపూడి నాగలక్ష్మి, రావాడ దుర్గాఆదిలక్ష్మి, గూడూరి దుర్గాభవాని, కవురు సత్యనారాయణ, బొక్కా గంగాధరరావు, బెజ్జవరపు నాగరాజు, వెంకటేష్ వడయార్, కొలుకులూరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.