నేరుగా ప్రజల వద్దకే..
శ్రీకాకుళం అర్బన్: ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారానికి కృషి చేయడంలో ఎప్పుడూ ముందుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నాయకులు సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 11, 12 తేదీల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజల సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులు రచ్చబండ కార్యక్రమం ద్వారా నేరుగా తెలుసుకుంటారు.
అనంతరం నాయకులు ఆ గ్రామంలోనే రాత్రికి పల్లె నిద్ర చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న బాధలను, పరిస్థితులను స్వయంగా పరిశీలించిన అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదించనున్నారు. తద్వారా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశ పెట్టనున్నారు.
పార్టీ నాయకురాలు రెడ్డి శాంతి తల్లికి శస్త్రచికిత్స కారణంగా పాతపట్నం నియోజకవర్గంలో 11వ తేదీన కార్యక్రమం నిర్వహించడం లేదు. అలాగే పలాస నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అకాల మరణం కారణంగా 11 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో నాయకులు పల్లె నిద్ర చేయనున్నారు.
♦ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గార మండలం వాడాడ, కొత్తూరు గ్రామాల్లో ధర్మాన ప్రసాదరావు శనివారం పర్యటించి పల్లెనిద్ర చేయనున్నారు. ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సరుబుజ్జిలి మండలం కొండ్రగూడెం గ్రామంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పల్లెనిద్ర చేస్తారు.
♦ టెక్కలి నియోజకవర్గం పరిధి నందిగాం మండలం అరసబాడ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట మండలం కడగండి గ్రామంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి,
♦ రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి పల్లెనిద్ర చేస్తారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధి రణస్థలం మండలం బంటుపల్లిలో సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో పల్లెనిద్ర చేస్తారు.