భార్య కాపురానికి రాలేదని....
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా ): భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకులలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మదన్‌పల్లి పాతతండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అలియాస్ రాజు(25)కు, మహేశ్వరం మండలం హర్షగూడ నివాసి సంధ్యతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. సురేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా సంధ్య ప్రసవం కోసం 10 నెలల కిందట హర్షగూడలోని తల్లిగారింటికి వెళ్లింది. పాప పుట్టి 8 నెలలు గడుస్తున్నా కాపురానికి రావడం లేదు. పలుసార్లు సురేష్ వెళ్లి అడిగితే, తన కూతురు పేరుతో రూ.4 లక్షల డబ్బు డిపాజిట్ చేయాలి లేదా 5 గుంటల పొలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తేనే కాపురానికి వస్తానని స్పష్టం చేసింది. దీంతో మన స్తాపానికి గురైన సురేష్ ఈ నెల 7న పాల్మాకులలోని మైసమ్మ చెరువులో దూకి చనిపోయాడు.