అక్కను కొట్టొద్దన్నందుకు..
ఒంగోలు క్రైం : అక్కను కొట్టొద్దని అడ్డు పడిన బావమరిదిని బావ గొంతు నులిమి చంపాడు. ఈ సంఘటన నగరంలోని అగ్రహారం గేటు అవతల ఉన్న బాలాజీనగర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. బాలాజీనగర్‌లో పామూరి రాజేశ్వరి, వెంకటేశ్వర్లు దంపతులు గొడవపడుతున్నారు. వెంకటేశ్వర్లు వరుసకు బావమరిది పూనూరి శోభన్‌బాబు (29) అక్కడికి వెళ్లి అక్కను కొట్టొద్దని బావకు అడ్డుపడ్డాడు.
ఆగ్రహించిన వెంకటేశ్వర్లు తన భార్యను కొట్టడం వదిలేసి శోభన్‌బాబు గొంతు పట్టుకొని గట్టిగా నులిమాడు. దీంతో శోభన్‌బాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. వెంకటేశ్వర్లుకు శోభన్‌బాబు మేనల్లుడు కూడా అవుతాడు. రాజేశ్వరి తన భర్తతో గొడవపడి రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. వాస్తవానికి వీరిది చీమకుర్తి మండలం పిడతలపూడి. మంగళవారం రాత్రి భార్య రాజేశ్వరి వద్దకు వచ్చాడు.
బుధవారం ఉదయం నిద్ర లేవగానే ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. ఆ ఘర్షణ మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంది. కూలి పనికి వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. వారి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్య నేరం కింద పామూరి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.