పానకాల స్వామికి రూ.38 కోట్ల ఆదాయం
విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూముల వేలంలో రూ.38 కోట్ల ఆదాయం లభించింది.మొత్తం 48 ప్లాట్లకు సీల్డు టెండరుతోపాటు బహిరంగ వేలం నిర్వహించారు. వీటిలో 26 ప్లాట్లకు టెండర్లు ఖరారు అయ్యాయి. వివరాలు ఇలావున్నాయి. వీజీటీఎం ఉడా, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో శుక్రవారం విక్రయాలు జరిగాయి. గుంటూరు విద్యానగర్ 3వలైను లోని దేవాలయ భూముల వేలం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ బొంతు మహేశ్వరరెడ్డి, ఈవోలు నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత దరఖాస్తులను ప్లాట్లు వారీగా విభజించి వేలం నిర్వహించారు. మొత్తం 48 ప్లాట్లకు వేలం నిర్వహించగా తొమ్మిది ప్లాట్లకు సింగిల్ టెండర్లు రావడంతో వాటి వేలం నిలిపివేశారు.
ఒకటికి మించి ఎక్కువ టెండర్లు వచ్చిన 26 ప్లాట్లకు వేలం నిర్వహిచారు. గరిష్టంగా చదరపు గజానికి రూ. 35 వేలు, కనిష్టంగా రూ. 24 వేలకు వేలం జరిగింది. ప్లాట్లనుకొనుగోలు చేసిన సభ్యులకు మూడు రోజుల్లోగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ పంపనున్నట్టు ఉడా చైర్మన్ తెలిపారు. ఆర్డర్స్ వచ్చిన తరువాత మూడు రోజులకు 10 శాతం నగదు, 15 రోజులకు 15 శాతం, 30 రోజులకు 25 శాతం, 45 రోజులకు 25 శాతం చెల్లించాలని ఇదేవిధంగా 60 వ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. 26 ప్లాట్లకు రూ. 37,63,86,527 ఆదాయం వచ్చిందని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వేలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు గజం రూ.23 వేలు నిర్ణయించగా కొనుగోలుదారులు అధిక మొత్తం చెల్లించి ఆదాయాన్ని సమకూర్చి స్వామి వారి కృ పకు పాత్రులయ్యారని తెలిపారు. ప్రారంభం నుంచి 57 ప్లాట్లకు వేలం నిర్వహించారని అందులో 5 ప్లాట్లు గతంలోనే అమ్మకాలు జరిగాయన్నారు .
నాలుగు ప్లాట్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 48 ప్లాట్లను వేలానికి పెట్టగా 26 ప్లాట్లకు వేలం జరిగిందన్నారు. మిగిలిన 22 ప్లాట్లకు మొదటి విడత చేపట్టిన ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయిన తరువాత వేలం నిర్వహణకు ప్రయత్నిస్తామన్నారు. ఉడాకు నష్టం.. వీజీటీఎం ఉడా, దేవాదాయశాఖ అధికా రులు నిర్వహించిన ఆలయ భూముల వేలంలో ప్లాట్లు దక్కించుకున్నావారే లాభపడినట్టయింది. చదరపు గజం గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.24 వేలకు పాడుకున్నారు. అంటే సగటు ధర రూ 30 వేలు పలికింది. అయితే ఈ ప్రాంతంలో గజం ధర రూ. 45 వేల నుంచి రూ. 60వేల వరకు ఉంది.