‘పంచతంత్ర కథలు’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్ర కథలు
నటీనటులు: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ తదితరులు
నిర్మాణ సంస్థ: మధు క్రియేషన్స్
నిర్మాత: డి. మధు
రచన-దర్శకత్వం: గంగనమోని శేఖర్
సంగీతం: కమ్రాన్
సినిమాటోగ్రఫి: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల
ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి
బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ఆ ఐదు కథలు ఏంటి? అవి ప్రేక్షకులను ఎలాంటి నీతిని భోధించాయో రివ్యూలో చూద్దాం.
ఈ చిత్రంలో మొత్తం ఐదు కథలు ఉన్నాయి.
1) అడ్డకత్తెర
కథేంటంటే.. కృష్ణ(నిహాల్) అనే యువకుడు క్షవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే వీధిలో ఉంటున్న యువతిని సత్య(సాదియ అన్వర్) ప్రేమిస్తాడు. వేరు వేరు కులాలకు చెందిన వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? చివరకు వీరి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఇప్పటికీ సమాజంలో కుల పిచ్చి అనేది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.కులామ మధ్య ఉండే అంతరాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ కథను తెరకెక్కించారు. మనం చేసే వృత్తుల వల్ల కులాలను నిర్ణయించారని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఇద్దరి ప్రేమికులను ఒకటి చేసే క్రమంలో పెద్దలకు వివరించి చెప్పారు.ఇందులో నిహాల్, సాదియాల నటన అందరినీ ఆకట్టుకుంటుంది.
2) అహల్య
కథేంటంటే.. రేవతి (ప్రణీత పట్నాయక్) ఓ వేశ్య. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పడుపు వృత్తిని ఎంచుకుంటుంది. ఆమెకు పెయింటింగ్ ఆర్టిస్ట్ అయోధ్య(అజయ్ )పరిచయం అవుతాడు. అతని పరిచయంతో ఆమె తనలో మార్పు వస్తుంది. వేశ్య వృత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకాలనుకుంటుంది. అలాంటి సమయంలో సమాజం నుంచి రేవతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆమె జీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉదంటే..
ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఓ వేశ్య మాములు మనిషిగా బతకాలని చూస్తే ఆమెను సమాజం ఎలా చూస్తుంది? అనేదానిని తెరపై చక్కగా చూపించారు. వేశ్య వృత్తికి ఎంత దూరంగా ఉండాలని చూసినా.. ఆ మార్పును సమాజం అంగీకరించదు. అందు కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందనేది ఈ కథ ద్వారా చూపించారు. వేశ్య వృత్తిని వదిలేసి వచ్చిన చిన్నచూపు చోడొద్దనేది ఈ కథ ఇచ్చే సందేశం. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. వేశ్యగా ప్రణీత పట్నాయక్ తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది.
3) హ్యాపీ మ్యారీడ్ లైఫ్
కథేంటంటే: మధ్యతరగతి కుటుంబానికి చెందిన కీర్తిక (నందిని రాయ్)కి డబ్బు అంటే పిచ్చి. బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందని భావించి ప్రాణంగా ప్రేమించిన ప్రశాంత్(నోయల్)ని వదిలేస్తుంది. అనుకున్నట్లే బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కీర్తిక జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. భర్తతో సుఖంగా జీవించిందా లేదా? లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన కీర్తికకి ప్రశాంత్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనేదే మిగతా కథ.
ఎలా ఉదంటే..
డబ్బుకు ఆశపడి నమ్ముకున్నోళ్లను మోసం చేయొద్దని అనేది ఈ కథ సారాంశం. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని కాదని, తండ్రి మాట కూడా లెక్క చేయకుండా కేవలం డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయికి ఓ భగ్న ప్రేమికుడు చెప్పే గుణపాఠం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువవడం.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపిస్తుంది.
4 ) నర్తనశాల
ఇందులో ఓ వింత లవ్‌స్టోరీని చూపించారు. డ్యాన్స్ స్కూల్ నడిపించే ఓ డ్యాన్స్ మాస్టర్(సాయి రోనక్)కు ఫోన్ ద్వారా శిరీష అనే యువతి పరిచయం అవుతుంది. ఆమెను చూడకుండా ప్రేమలో పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాతను ఆమె చూడాలని ఉందని చెప్పి బీజ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. మరి బీచ్‌లో వీరిద్దరు కలిశారా? అసలు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు? వీరిద్దరు కలిశాక ఏం జరిగింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే
ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్‌తో ఫోన్లో మాట్లాడింది ఎవరనే సస్పెన్స్‌ని క్లైమాక్స్ వరకు కొనసాగించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా ఎలాంటి మోసాలు జరుగుతాయి? ఫోన్ పరిచయాల ద్వారా మోససోయిన వ్యక్తులను నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారికి ఇది నచ్చుతుంది.
5) అనగనగా
వృద్ధురాలు కమలక్క (గీతా భాస్కర్)ది ఇద్దరి కుమారుల మధ్య నలిగిపోయే జీవితం. భర్త ఉన్నప్పుడు ఎంతో హుందాగా బతికిన ఆమె.. వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకులు చెరో నెల అని ఆమెను పంచుకుంటారు. దాని వల్ల ఆమెకు ఎదురయ్యే సమస్యలేంటి? వృద్దాప్యంలో ఆమె జీవితం ఎలా సాగిందనేదే ఈ కథ.
ఎలా ఉదంటంటే..
ఆస్తులను పంచుకున్నట్లుగా తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్నారు నేటి పిల్లలు. చెరో నెల అంటూ వంతులు పెట్టికొని మరీ వారిని పోషిస్తున్నారు. దీని వల్ల పేరెంట్స్ పడే బాధ ఏంటి అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు.సగటు తల్లి పడే బాధ ఏంటో గీతా భాస్కర్ ద్వారా తెరపై చక్కగా చూపించారు.
మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ పంచతంత్రకథలు.. మంచి సందేశాన్ని ఇచ్చాయి. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి.సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయింది. మొదటి కథలో వచ్చే మోతెవారి పాటతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. చిత్ర దర్శకుడు గంగనమోని శేఖర్ యే సినిమాటోగ్రాఫర్ కావడంతో మంచి విజువల్స్ తీశారు. దీనికి మరో సినిమాటోగ్రాఫర్ విజయ్ భాస్కర్ సద్దల కూడా తన వంతు సహకారం అందించారు. శ్రీనివాస్ వరగంటి ఎడిటింగ్ పర్వాలేదు. సాధారణంగా ఏ నిర్మాత అయినా తన తొలి చిత్రాన్ని కమర్షియల్ ఫార్మెట్లో నిర్మిస్తాడు. అలాంటి చిత్రాలను నిర్మిస్తే.. సేఫ్ జోన్లోకి వెళ్లొచ్చు. కానీ నిర్మాత డి మధు మాత్రం.. తొలి చిత్రంగా మంచి సందేశాత్మకమైన అంశాలు ఉన్న ‘పంచతంత్రకథలు’ ఎంచుకోవడం అభినందనీయం.