ఏసీబీ వలలో పంచాయతీ ఈవో
రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
మధ్యవర్తినీ అదుపులోకి తీసుకున్న అధికారులు
బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం సొమ్ము డిమాండ్
కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు పంచాయతీ ఈవో ఆర్.భవానీప్రసాద్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బిల్డింగ్ ప్లాన్ అనుమతుల కోసం గురువారం రూ.8 వేలు లంచం తీసుకోగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. స్థానిక ఏలూరు రోడ్డు సమీపంలో నివాసముంటున్న చేపల రైతు సైదు ఆనందరావు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎన్నికల నామినేషన్ల విధుల్లో ఉన్న ఈవోకు ఎనిమిది రూ.1000 నోట్లను లంచంగా అందించేందుకు వెళ్లాడు.
బయటకు వచ్చి నగదు తీసుకున్న ఆయన వాటిని మధ్యవర్తి, లెసైన్స్డ్ సర్వేయర్ గుడిపాటి జగన్నాథానికి ఆ సొమ్ము అందజేశాడు. ఇంతలో మారువేషాల్లో ఉన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని చూసి జగన్నాథం పారిపోతుండగా అధికారులు వెంటపడి పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి గదిలోకి తీసుకెళ్లి విచారణ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద చివరి రోజు నామినేషన్లు కావడంతో మండంలోని వివిధ గ్రామాల అభ్యర్థులు, మద్దతుదారులతో కోలాహలంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా జగన్నాథాన్ని ఏసీబీ అధికారులు బలవంతంగా తీసుకెళ్లడంతో ఏం జరుగుతోందో తెలియని గందరగోళ స్థితి ఏర్పడింది.
అసలేం జరిగిందంటే...
మండవల్లి మండలం దేవి చింతపాడుకు చెందిన సైదు పాండురంగారావు స్థానిక ఏలూరు రోడ్డులో స్థలం కొన్నాడు. ఆయన మరణానంతరం కుమారుడు ఆనందరావు భవనం నిర్మించుకున్నాడు. ఇటీవల పై అంతస్తు నిమిత్తం బ్యాంకు రుణం కోసం పంచాయతీ ప్లాన్ అప్రూవల్ పొందేందుకు ఫిబ్రవరి 28న కైకలూరు పంచాయతీ ఈవో భవానీప్రసాద్‌ను కలిశాడు. రూ.20 వేలు లంచం ఇస్తే వెంటనే ఇస్తానని ఆయన సమాధానమిచ్చాడు. తన తండ్రి బతికున్నప్పుడే అప్రూవల్ కోసం దాఖలు చేసుకున్నామని చెప్పగా, ఆ రసీదులు తీసుకురావాలని చెప్పాడు. తీరా తీసుకొచ్చాక వాటికి కాలం చెల్లిందని, కొత్తవి తీసుకోవాలని తెలిపాడు. ఇలా అనేక పర్యాయాలు కార్యాలయం చుట్టూ తిప్పటంతో విసిగి వేసారిపోయిన ఆనందరావు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
అధికారుల పథకం ప్రకారం ఈవోతో మాట్లాడగా జగన్నాథంతో మాట్లాడాలని చెప్పాడు. చివరికి రూ.8 వేలకు పనిపూర్తిచేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆనందరావు గురువారం పంచాయతీ కార్యాలయంలో అప్రూవల్ నిమిత్తం రూ.6,586 చెల్లించి ఆ రసీదుతో లంచం నగదు రూ.8 వేలు తీసుకుని ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చాడు. జగన్నాథం ఎదురుగా నగదును అందించాడు. పంచాయతీ సిబ్బంది ఏకంగా రసీదు పుస్తకాన్ని కూడా ఈవో వద్దకు పంపించారు. అధికారులు రసీదు పుస్తకాన్ని కూడా సీజ్ చేసి, పలువురు పంచాయతీ సిబ్బందిని కూడా విచారణ చేశారు.
ఈవో ఇంటిపై సోదాలు చేస్తున్నాం : డీఎస్పీ
ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ విలేకరులతో మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈవోను శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. గుడివాడలోని ఈవో ఇంటిలో సోదాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల గుంటూరు, విజయవాడ పరిధిలో 9 కేసులు నమోదు చేశామన్నారు. అధికారులు లంచం అడిగితే 9440446164, 9440446167, 9440446133 సెల్ నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, 10 మంది సిబ్బంది పాల్గొన్నారు.
లంచగొండుల ఆట కట్టించడానికే...
కైకలూరు పంచాయతీ కార్యాలయంలో కింది స్థాయి నుంచి పైస్థాయి సిబ్బంది వరకు తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని, చివరకు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని బాధితుడు ఆనందరావు చెప్పారు. పలుమార్లు ఈవోను కలవగా.. రూ.20 వేలు ఇస్తే వెంటనే పని పూర్తిచేస్తానని చులకనగా మాట్లాడారని తెలిపారు.