ఢిల్లీలో గ్యాంగ్ రేప్
⇒ తప్పించుకునేందుకు బాల్కనీ నుంచి దూకిన బాధితురాలు
⇒ సాయంకోరినా స్పందించని పాదచారులు
న్యూఢిల్లీ: మరో ఘోరానికి దేశ రాజధాని ఢిల్లీ మౌన సాక్షిగా నిలిచింది. తనపై సామూహిక అత్యాచారం చేశారని, సాయం చేయాలంటూ 26 ఏళ్ల నేపాలీ మహిళ రోడ్డుపై నగ్నంగా నడుస్తూ పాదచారుల్ని అర్థించినా ఎవరూ కనికరించలేదు. ఆమెకు సాయం చేయకపోయినా.. కనీసం పోలీసులకు సమాచారం అందించేందుకు కూడా ముందుకు రాలేదు. విషయం పోలీసులకు తెలిసి వారు వచ్చేవరకూ ఆమె అలా నిస్సహయురాలిగానే ఉండిపోయింది. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ సంఘటన ఢిల్లీలోని పాండవనగర్ ప్రాంతంలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో... తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఆ మహిళ బాల్కనీ నుంచి దూకేసింది. ఈ క్రమంలో ఆమె స్వల్పంగా గాయపడి రోడ్డుపై సాయం అర్థిస్తూ అలానే ఉండిపోయింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న బాధితురాలిని పాండవనగర్‌లోని ఫ్లాట్ వద్ద పని ఉందంటూ వికాస్ అనే వ్యక్తి కారులో తీసుకెళ్లాడు. ఆమెను తీసుకెళ్తున్న క్రమంలో మధ్యలో మరో ఇద్దరు స్నేహితుల్ని వికాస్ ఎక్కించుకున్నాడు. ఫ్లాట్‌కు వెళ్లాక అక్కడ మరో ఇద్దరు ఉండడంతో బాధితురాలు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే ఐదుగురు నిందితులు ఆ మహిళను బంధించి తెల్లవారుజామువరకూ అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ బాధితురాలు బాల్కనీ నుంచి కిందికి దూకేసింది.
తనకు వికాస్ నాలుగు నెలల నుంచి తెలుసని, ఇంటి వద్ద దింపుతానంటూ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని వాంగ్మూలంలో బాధితురాలు పేర్కొంది. తనతో మద్యం తాగించేందుకు నిందితులు ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపింది. బాధితురాలు రెండుసార్లు తన వాంగ్మూలం మార్చిందని, అన్ని కోణాల్లోను కేసును విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు పశ్చిమ ఢిల్లీలోని పాండవ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురి నిందితుల్లో లక్ష్యే భల్లా, నవీన్, ప్రతీక్‌లు వివిధ కాల్సెంటర్లలో పనిచేస్తుండగా, మరొకర్ని టెక్ మహీంద్రాలో పనిచేస్తున్న స్వరిత్గా గుర్తించారు.