పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఆదిలాబాద్ అర్బన్ : పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న జాతీయ జెండా ఎగురవేస్తారని తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ శాఖల అధికారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా శకటాలు రూపొందించాలన్నారు.
శకటాల ఏర్పాట్లను అదనపు జేసీ పర్యవేక్షిస్తారని చెప్పారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, దీనికి డ్వామా పీడీ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి కార్యక్రమాలపై మంగళవారం సాయంత్రంలోగా ఒకపేజీకి మించకుండా మంత్రి సందేశం తయారు చేసి పంపాలన్నారు. వివిధ ఆస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, దీనిని సీఈవో స్టెప్ పర్యవేక్షిస్తారని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను డీపీఆర్వో చూస్తారని చెప్పారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, అదనపు జేసీ రాజు, డీఆర్వో ప్రసాదరావు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, అధికారులు పాల్గొన్నారు.