అప్పు ఎలా తీర్చాలో తోచక..
♦ యువరైతు ఆత్మహత్య
♦ ఎండుతున్న పంటలతో మనస్తాపం
మద్నూర్ : వర్షాలు కురవక వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోవడంతో పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలి యక తీవ్ర మనస్తాపం చెందిన పాండ్రెవార్ మష్ణా (31) అనే యువరైతు శుక్రవారం తన పోలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మద్నూర్ మండ లం లింబుర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. లింబుర్‌కు చెందిన మష్ణా తనకున్న రెండెకరాల్లో సోయూ, పెసరతో పాటు అంతర పంటగా కంది సాగుచేశాడు. నెల రోజుల క్రితం వర్షాలు సకాలంలో కురియడంతో పంటకు ఇబ్బంది లేదని సాగు చేశాడు. సాగు కోసం రూ. 35 వేలు అప్పు చేశాడు.
నాటి నుంచి నేటి వరకు వర్షాలు కురియక పోవడంతో అప్పులు ఏలా తీర్చాలో అంటూ తరచూ ఇంట్లో బాధపడేవాడని మష్ణా తండ్రి గుండప్ప రోదిస్తూ తెలిపాడు. గత సంవత్సరం పంటలు పండక తీవ్ర అప్పుల్లో ఉన్న తన కొడుకుకు ఈ సారి కూడా అప్పులే మిగలడంతో మనస్థాపానికి గురయ్యేవాడని వాపోయూడు. అంతేకాకుండా మష్ణా మహరాష్ట్రలోని నాందేడ్‌లో కూలీ పని చేస్తూ వారానికి ఒకసారి వచ్చి పంటలు చూసి వెళ్లే వాడని మృతుడి భార్య అంజనీబాయి తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నాందేడ్ నుంచి ఇంటికి వచ్చిన మష్ణా శుక్రవారం ఉదయం పంటలు చూసివస్తానని ఇంట్లో చెప్పి పొలానికి వెళ్లాడని వారు తెలిపారు.
పొలంలో ఎండిపోతున్న పంటలు చూసి ఆందోళనకు గురై పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. పొలంలో అనుమానస్పద స్థితిలో పడిఉన్న మష్ణాను చూసిన పశువుల కాపరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పొలానికి చేరుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బన్సీ తెలిపారు. మష్ణాకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.