పారిశుద్ధ్య కార్మికులపై దాడి
నిడదవోలు : పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా పందులను పట్టుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులపై పందుల పెంపకందారులు దాడికి పాల్పడిన సంఘటన నిడదవోలులో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలో పందుల సంచారం ఎక్కువకావడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి చర్యలకు ఉపక్రమించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పందులను నిర్మూలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
ఈ క్రమంలో పట్టణంలో సంత వద్ద పందుల సంచారం ఎక్కువగా ఉండటంతో శానిటరీ మేస్త్రీ చంద్రబాబు పర్యవేక్షణలో బుధవారం ఉదయం 6.30 గంటలకు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు పందులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సుమారు 20 మంది పందుల పెంపకందారులు ఇక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారమే పందులను పట్టుకుంటున్నామని పారిశుద్ధ్య మేస్త్రి, కార్మికులు చెబుతున్నా వినిపించుకోకుండా పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేశారు.
దీంతో పారిశుద్ధ్య కార్మికులు బంగారు సత్తిబాబు, ముత్యాల సాయి, బొచ్చా దుర్గాప్రసాద్ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, పట్టణ ఏస్సై ఎస్.సతీష్, కమిషనర్ జి.కృష్ణమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చైర్మన్ కృష్ణమూర్తి బాధితులను పరామర్శించారు. పందుల నిర్మూలనకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదని పెంపకందారులను హెచ్చరించారు. సంఘటనపై కమిషనర్ జి.కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన పందుల పెంపకందారులు కోతాడ చిన్నా, జి.సూరిబాబు, గాడా బాలజీపై ఎస్సై జి.సతీష్ కేసు నమోదు చేశారు.