నా భర్త అంత్యక్రియల రశీదు ఇప్పించండి
ఏసీపీని ఆశ్రయించిన చక్రి భార్య శ్రావణి
బంజారాహిల్స్: తన భర్త చక్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక నుంచి డూప్లికేటు రశీదు ఇప్పించాలని కోరుతూ చక్రి భార్య శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనకు ఇస్తానని చక్రి బావ నాగేశ్వర్రావు ఒరిజినల్ రశీదును పంజగుట్ట శ్మశాన వాటిక నుంచి తీసుకు వెళ్లారని... ఇంత వరకు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రశీదు నిర్ణీత గడువు మంగళవారంతో ముగుస్తుందని ఆ తర్వాత అది పని చేయదని తక్షణం పరిష్కారంగా తనకు డూప్లికేట్ రశీదు ఇప్పిస్తే జీహెచ్ఎంసీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకుంటానని తెలిపారు.
అయితే నిబంధనలు ఎలా ఉంటాయని పంజగుట్ట హిందూశ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్‌ను ఏసీపీ పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారి ఒరిజినల్ రశీదు తీసుకున్న తర్వాత నెల రోజుల్లోపల డూప్లికేట్ ఇవ్వడం కుదరదని, గడువు ముగిసిన తర్వాత మరొకటి ఇస్తామని ఆయన వివరించారు. శ్రావణికి ఇస్తామని చెప్పి నాగేశ్వర్రావు అనే వ్యక్తి తమ వద్ద నుంచి చక్రి మృతి చెందిన మూడు రోజులకే వచ్చి రశీదు తీసుకున్నారని పోలీసులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తనకు చక్రి అంత్యక్రియలకు సంబంధించి రశీదు ఇవ్వాలంటూ శ్రావణి పోలీసుల సమక్షంలో శ్మశాన వాటిక అధ్యక్షుడు అనిల్‌కుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. శ్రావణితో పాటు పోలీస్ స్టేషన్‌కు ఆమె తండ్రి మధుసూదన్‌రావు కూడా వచ్చారు.