ఏకగ్రీవం
శాసనసభా పక్ష నేతగా జయలలిత
ముఖ్యమంత్రి
పన్నీర్‌సెల్వం రాజీనామా
నేడు సీఎంగా జయ ప్రమాణస్వీకారం
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో జయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి ఈనెల 11వ తేదీన వచ్చిన తీర్పులో జయ నిర్దోషిగా బైటపడడంతో అధికార హోదాపై నిషేధం తొలగింది. సీఎం పదవి చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాల్పిందిగా పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఉదయం 6 గంటల నుండే సందడి మొదలైంది. అన్నాడీఎంకే మొత్తం 151 మంది ఎమ్మెల్యేలుండగా స్పీకర్ హోదాలో ఉన్న కారణంగా ధనపాల్, ఆసుపత్రిలో ఉన్న సెందూర్ పాండియన్, జైల్లో ఉన్న అగ్రి కృష్ణమూర్తి, రాజీనామా చేసిన వెట్రివేల్ హాజరుకాలేదు. ఐదు మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు.
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో సమావేశం ప్రారంభం కాగా శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్లు పన్నీర్‌సెల్వం ప్రకటించారు. ఆ తరువాత జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా కరతాళ ధ్వనలు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం ఆమోదం కాగానే పదినిమిషాల్లో సమావేశాన్ని ముగించారు. ఐదు మంది మంత్రులు వెంటరాగా పన్నీర్‌సెల్వం తన రాజీనామాను తీర్మానప్రతిని ఉదయం 7.45 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేవరకు కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరారు. జయను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానం పంపారు.
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా మధ్యాహ్నం 1.28 గంటలకు పోయిస్గార్డెన్ నుండి బయలుదేరిన జయ ప్రజలకు అభివాదం చేసుకుంటూ 2.15 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్ సిబ్బంది తొలుత జయకు స్వాగతం పలికి గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు. గవర్నర్ కే రోశయ్య జయకు పుష్పగుచ్చం ఇవ్వగా, ఆయన సతీమణి శివలక్ష్మి జయకు శాలువాకప్పి సత్కరించారు. ఆనంతరం జయ సైతం గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చారు. అనంతరం రోశయ్య, జయలు అరగంటపాటూ సంభాషించుకున్నారు. 28 మంది మంత్రులతో కూడిన జాబితాను గవర్నర్‌కు జయ సమర్పించారు. 2.15 గంటలకు రాజ్‌భవన్ నుండి బయలుదేరిన జయ నేతల విగ్రహాలకు మాలలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు.
ముస్తాబైన మద్రాసు హాలు
జయ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మద్రాసు సెంటినరీ ఆడిటోరియం ముస్తాబు పూర్తిచేసుకుంది. ఈనెల 23 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సం ప్రారంభం అవుతుంది. కార్యక్రమానికి ఏపీ, ఒడివా సీఎంలు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రవిశంకరప్రసాద్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.