పళనికి పన్నీరు సెల్వం షరతు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాల విలీనంపై అన్నాడీఎంకేలో హైడ్రామా కొనసాగుతోంది. పన్నీరు సెల్వం వర్గం స్వరం పెంచడంతో చర్చలపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. శశికళ, ఆమె బంధువు దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించాలని, జయలలిత మృతిపై విచారణకు ఆదేశించాలని పన్నీరు వర్గీయులు డిమాండ్లు చేస్తున్నారు. ఆ తర్వాతే విలీనం, పార్టీ బాధ్యతలపై చర్చలకు వెళతామని సెల్వం వర్గీయులు మునుస్వామి, సీహెచ్ పాండియన్ షరతు విధించారు.
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చర్చలంటూనే అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని పన్నీరు సెల్వంకు అప్పగించాలని ఆయన వర్గీయులు మరో డిమాండ్ చేస్తున్నారు. జయలలిత నియమించినందున సీఎం పదవి తనకే దక్కాలని సెల్వం భావిస్తున్నారు. కాగా సీఎం పదవి ఇచ్చేదిలేదని పళనిస్వామి వర్గం తెగేసి చెబుతోంది. పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆయనే సీఎంగా కొనసాగుతారని తంబిదురై స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య విలీన చర్చలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు.