' ధనుష్‌లో మరో కోణాన్ని చూస్తారు'
చెన్నై: వరుస హిట్లతో జోరు మీదున్న హీరో ధనుష్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పక్కింటి అబ్బాయిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ధనుష్ ఈసారి రైల్వే పాంట్రీ కార్మికుడి పాత్ర పోషించబోతున్నాడు. సాధారణంగా కొత్తవాళ్లతోనే సినిమా తీసే దర్శకుడు ప్రభు... ధనుష్ అద్భుతమైన నటనకు ఫిదా అయ్యానంటున్నారు. అందుకే తన కొత్త సినిమా హీరోగా ధనుష్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.
ఇంకా పేరు నిర్ధారించని ఈ చిత్రంలో ధనుష్‌లో మరో కోణాన్ని చూస్తారని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా మరో కొత్త హీరోయిన్ పరిచయం కాబోతుందని, మిగతా నటీనటులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి చెన్నై మధ్య తిరిగే ఓ యువకుడి కథే ఈ సినిమా అనీ...సినిమా మొత్తం కదులుతున్న రైలులోనే నడుస్తుందని దర్శకుడు ప్రభు సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఇక రఘువరన్ బి.టెక్, అనేకుడు వరుస విజయాలతో జోరు మీదున్న ధనుష్ మరో రొమాంటిక్ సినిమా 'మారి' షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు. అలాగే గత ఏడాది బ్లాక్ బ్లస్టర్ మూవీ రఘువరన్ బి.టెక్(వేళ ఇల్లాద పట్టదారి) టీంతో మరో ప్రాజెక్టు షూటింగ్లో బిజీగా ఉన్నాడు.