పొత్తు వెనుక ఎత్తు
దేవరకొండ, న్యూస్‌లైన్ పీఏపల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తేర గోవర్దన్‌రెడ్డి కూతురు తేర స్పందనరెడ్డి , వైఎస్సార్సీపీ నుంచి సపావత్ సాలి, బీజేపీ నుంచి పల్లా మంజుల, సీపీఎం నుంచి కంబాలపల్లి కవిత, స్వతంత్ర అభ్యర్థిగా సాహితి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బలమైన నాయకుడైన గోవర్దన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇక్కడ టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈపొత్తు రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చే అవకాశమున్నందున టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అలుగుబెల్లి వెంకటేశ్వర్‌రెడ్డి తన సతీమణి శోభారాణిని పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు.
టీడీపీ తన అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్తో జతకలిసి గోవర్దన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇక్కడ సరికొత్త ట్రెండుకు తెరలేపింది. వీరు టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ జెండాలతోనే బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం మరికొందరు అభ్యర్థులు కూడా రంగంలో ఉండి ఉడతాభక్తిగా ఇటు గోవర్దన్‌రెడ్డి వర్గం, అటు వెంకటేశ్వర్ రెడ్డి వర్గాలకు సహకరిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా విభిన్నమైన కలయికతో ఇక్కడ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.