బొప్పాయి.. డెంగీకి బైబై...
వ్యాధి నియంత్రణకు మార్గమంటున్న డాక్టర్లు
* నగరంలో పెరిగిన పండ్ల అమ్మకాలు
* మూడింతలు పెరిగిన ధర
సాక్షి, ముంబై: డెంగీ నియంత్రణకు బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతోందని డాక్టర్లు చెబుతుండటంతో దానికి నగరంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డెంగీ కారక దోమల ఉధృతితో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగీకి ప్రత్యేకించి ఔషధాలు ఏమీ లేవని, జ్వరాన్ని నియంత్రించడమొకటే మార్గమని పలువురు పేర్కొంటున్నారు. అయితే బొప్పాయి పండు రసం సేవించడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (ఏపీఎంసీ)లో గత కొన్ని వారాలుగా బొప్పాయికి విపరీతమైన డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ పండ్ల వ్యాపారి మాట్లాడుతూ.. డెంగీ నియంత్రణకు ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్న కారణంగా బొప్పాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇటీవల రెండు నెలల కిందట ఈ పండ్ల అమ్మకాలు సాధారణస్థాయిలో ఉన్నాయని, కాని ప్రస్తుతం వీటి అమ్మకాలు మూడింతలు పెరిగాయని తెలిపారు. కొన్ని వారాల కిందట కిలో రూ.8 -15 పలికిన ఈ పండ్లు ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఈ పండు కిలో రూ.20 నుంచి 25 వరకు ధర పలుకుతున్నాయి. కాగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.30 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏపీఎంసీ మార్కెట్ డెరైక్టర్ సంజయ్ పాన్సారే మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా డెంగీ వ్యాధి నవీ ముంబైతోపాటు చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. బొప్పాయిలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో వీటి డెంగీ పీడితులకు ఈ రసం తాగించాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వినియోగం బాగా పెరిగిందన్నారు. గతంలో మార్కెట్కు రోజుకు 10 నుంచి 15 ట్రక్కుల బొప్పాయి సరఫరా కాగా, ప్రస్తుతం రోజుకు 40 ట్రక్కుల వరకు సరఫరా అవుతోందని ఆయన వివరించారు.